జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందనిపిస్తోందని.. కానీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క సలహా ఇచ్చింది లేదన్నారు. ఇంత దిగజారి సంస్కార హీనంగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదన్న ఆయన.. ఒక విజన్ లేకుండా… నాకేదో వ్యూహం ఉంది అని గొప్పగా చెప్పుకోడానికి ప్రయత్నం చేశారని సెటైర్లు వేశారు. తెలుగు ప్రజలు పవన్ కల్యాణ్‌కి గొప్ప స్టార్ డమ్ ఇస్తే దానిని ఉపయోగించుకోలేకపోతున్నారని.. ఇంకా సినిమాల్లో ఉన్నట్లే అనుకుంటున్నాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్‌కు అసలు కారణం.. పార్టీ పెట్టి 12 ఏళ్లు అయినా ఒక్క ఎంపీపీ కూడా గెలవలేదనే అంటూ ఎద్దేవా చేశారు పార్థసారథి.. ఇక, సినిమా రంగం వల్ల పవన్ కల్యాణ్ బాగుపడ్డాడు.. కానీ, పవన్ వల్ల సినిమా రంగం బాగుపడలేదన్న ఆయన.. తానే సినీ పరిశ్రమ అనే తరహాలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. ప్రేక్షకులను దోచుకుంటున్న తీరును అరికట్టాలని ఆన్‌లైన్ సిట్టం పెట్టబోతున్నాం అని స్పష్టం చేశారు. అసలు నీ బుద్ధి తెలిసి నిర్మాతలంతా వచ్చి మంత్రి పేర్నినానిని కలిశారని తెలిపిన మాజీ మంత్రి.. ఫిల్మ్ ఛాంబర్ కూడా మీ మాటలను వ్యతిరేకించిందన్నారు.
రాజు నేను గెలవాలి.. నా రాజ్యాన్ని గెలిపించాలి అనుకుంటాడు… ఓడిపోవాలని అనుకోడన్న పార్థసారథి.. రాస్కో అంటే ఏంటి..? రాస్కొని ఏం చేస్తావు అంటూ ప్రశ్నించారు. జనసైనికులకి చెప్తున్నా… ఈయన్ని పట్టుకుని మీరు వెళితే తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అంటూ కామెంట్ చేశారు. వైఎస్ వివేకా హత్య గురించి, కోడి కత్తి గురించి పవన్ మాట్లాడుతాడు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది… అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావ్ అని నిలదీశారు పార్థసారథి.. మేమే సీబీఐ విచారణ కోరాం.. రాష్ట్రంలో ఈ రెండు సమస్యలే ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన అవే సమస్యలు అనుకుంటే ఎందుకు ఢిల్లీలో ప్రశ్నించడం లేదన్నారు. నీకు ఈ పిచ్చి ఎవరిదగ్గరి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేసిన ఆయన.. అసలు నువ్వు ఏం ప్రశ్నలు అడిగావో నీకు అర్థం అవుతుందా..? పైగా వర్గ శత్రువులు అంటూ రాజకీయాల్లోకి కొత్త ఫిలాసఫీ తెచ్చాడని మండిపడ్డారు. కమ్మ వారు వైస్సార్సీపీకి వర్గ శత్రువులు కాదు… మాలో మంత్రులు కమ్మ వారున్నారని గుర్తుచేశారు.. బుద్ధి లేకుండా వర్గ శత్రువులు అంటూ కొత్త ఫిలాసఫీ తీసుకురావద్దు అని హితవుపలికారు.. యుద్ధం అంటాడు, సాయుధపోరాటం అంటాడు, అసలు ప్రజాస్వామ్యం అంటే తెలుసా ? అని ప్రశ్నించారు. అసలు అతను ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కాదని కామెంట్ చేసిన పార్థసారథి.. తుని సంఘటన సమయంలో నువ్వు ప్రభుత్వంలో భాగస్వామివి.. మళ్లీ రైలు సంఘటన వైఎస్సార్సీపీ పని అంటాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.