దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని, ఫలితంగా ఆ రంగం ఇబ్బందుల్లో పడిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈరోజు నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read: కిమ్ మరో కీలక నిర్ణయం: గ్రామీణాభివృద్ధి, ఆహారంపై ప్రత్యేక దృష్టి…
ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే మూడో వేవ్ సంకేతాలు దేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. వారం రోజుల క్రితం 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు, ఇప్పుడు 4.59 శాతానికి చేరుకుంది. ఇది 5 శాతానికి చేరితే రెడ్ అలర్ట్ ప్రకటించక తప్పదు. టోటల్‌గా కర్ఫ్యూ విధించాల్సి రావొచ్చు. ఢిల్లీతో పాటు ముంబై నగరంలోనూ పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు కూడా ముంబై నగరంలోనే అధికసంఖ్యలో ఉన్నాయి. ముంబైలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులుండగా, ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇక దేశం మొత్తం మీద 1700 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణం కావడంతో అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.