తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి సీఎం పీఠం అధిరోహించారు.
2014 నుంచి ఎప్పుడైనా మాకు పదవులు రాకపోతాయా అని టీఆర్ఎస్ నేతలు ఎదురుచూశారు. కానీ వారికి మొదటి దఫాలో ఎలాంటి అవకాశం రాలేదు. రెండవ సారైనా అవకాశం రాకుండా పోతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ కూర్చున్నారు. మరో రెండేళ్ళలో ఎన్నికలు రానున్నాయి. రెండవసారి ఎన్నికయ్యాక నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తారని భావించారు. కానీ మూడేళ్ళు అవుతున్నా వాటికి అతీగతీ లేదు. ఈసారి కాకుంటే ఇంకెప్పుడు అని మళ్ళీ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు గులాబీ నేతలు.
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ తెరమీదకు వచ్చింది. అక్టోబర్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యాక ఖాళీగా వున్న అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావించారు. అయితే అనూహ్యంగా ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ కి బదులుగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం సాధించారు.
వందలాదిమంది నేతలు 2018 నుంచి నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తూనే వున్నారు. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ల నియామకం జరిగింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 500 కు పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా వున్నాయి. 2018 నుంచి భర్తీ కాని పోస్టులు అనేకం వున్నాయి. వాటిపై కేసీఆర్ ఫోకస్ పెడతారని అంతా భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కాలపరిమితి మూడేళ్ళ వరకూ వుంటుంది. అసెంబ్లీ ఎన్నికలు 2018, లోక్ సభ ఎన్నికలు 2019లో, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాయి. 2020 జనవరిలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 2020 డిసెంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి,
నామినేటెడ్ పోస్టులు వస్తే తమ పంట పండుతుందని భావించారు అసహనంతో వున్న టీఆర్‌ఎస్ నేతలు. కానీ కేసీఆర్ ఆ దిశగా అడుగుల వేయకపోవడంతో కొంతమంది నేతలు విపక్ష పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆశించిన వారికి పదవులు రాలేదు. కరీంనగర్ కి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ పెద్దల సభపై కన్నేశారు. టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ రవీందర్ సింగ్ ఆశలపై చన్నీళ్ళు చల్లారు. దీంతో ఆయన రెబల్ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు.
రవీందర్ సింగ్ బాటలో అనేకమంది టీఆర్ఎస్ నేతలు వున్నట్టు తెలుస్తోంది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ నేతలపై కన్నేశారు. పదవులు రాకుంటే పార్టీ వీడతామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకోవడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కేసీఆర్ త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడతారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు పదవులు భర్తీ కాకుంటే తమ ఆశలు తీరవంటున్నారు గులాబీ నేతలు. కేసీఆర్ ఎవరెవరికి పదవుల బహుమతులు ఇస్తారో చూడాలి.