ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు (61) శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. 1994లో తన భార్య జయ.బి సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బి ఏ రాజు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు బి.ఎ. రాజు పి.ఆర్. ఓ.గా పని చేశారు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు.
చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ. బి దర్శకత్వంలో ‘ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం’ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. బి.ఎ. రాజు తనయుడు అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు. మరో కుమారుడు శివ కుమార్… ప్రస్తుతం ’22’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బి ఏ రాజు ఎదిగారు. బి.ఏ.రాజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బి ఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమను, సినీ పాత్రికేయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు బి.ఎ. రాజు ఆకస్మిక మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 11.00 లకు మహాప్రస్థానంలో బి.ఎ. రాజు అంత్యక్రియలు జరుగబోతున్నాయి.