ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జోనల్ విధానం వచ్చినప్పట్టి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు.. ఇక, రేపో మాతో ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు అని నీరక్షిస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ సర్కార్.. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మినహా మిగిలిని 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను తీసుకొచ్చింది.
Read Also: ఆంగ్ సాన్సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు అధికారులు… ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, జోనల్ పోస్టులకు, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగియగానే చేపట్టనున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగనుండగా.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన చేపట్టనున్నారు.. 70 శాతానికి పైగా సమస్యలు ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.. పిల్లల్లో మానసిక దివ్యాంగులుంటే ప్రాధాన్యం దక్కనుంది.. వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పాత జిల్లాల పరిధి.. కొత్త జిల్లాల ప్రకారం ఆప్షన్లను కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.