ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: కష్టపడి పని చేసిన వారికే అవకాశాలు: చంద్రబాబు
పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర చేస్తారని చర్చ నడుస్తోంది. ఈ యాత్రల ద్వారా వైసీపీ సర్కారు వైఫల్యాలను వీరిద్దరూ ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అయితే వయసు రీత్యా చంద్రబాబు పాదయాత్ర చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుందని.. అందుకే పాదయాత్రను చిన్నబాబుకు అప్పగించారని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలోని 175 నియోజకవర్గాలకు కనీసం 100 నియోజకవర్గాల్లో రెండేళ్లు ముందుగానే అభ్యర్థులకు టికెట్ గ్యారెంటీ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. మరోవైపు మేనత్త భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానిస్తే కనీసం జూనియర్ వార్నింగ్ ఇవ్వలేదన్న అంశంపైనా టీడీపీ పొలిట్ బ్యూరో చర్చించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం వంటి అంశం కూడా చర్చించినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.