అసలే నియోజకవర్గాలలో అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి. మెరుగు పరుచుకోవడానికి అవకాశం వచ్చినా ఆ ముగ్గురు సద్వినియోగం చేసుకోలేదట. అందుకే కేడర్ వారిపై గుర్రుగా ఉంది. మళ్లీ చూద్దామన్న నేతల మాటలను జీర్ణించుకోలేకపోతున్నారట. లాభం లేదని అధినేతకు ఫిర్యాదులు చేశారట తమ్ముళ్లు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సోషల్ మీడియాలో ఇంఛార్జ్‌లపై తమ్ముళ్లు ఫైర్!
చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తీ, తిరుపతి నియోజకవర్గాల ఇంఛార్జులు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో చర్చగా మారారు. చంద్రగిరి ఇంఛార్జ్ పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి ఇంఛార్జ్ సుగుణమ్మలపై తమ్ముళ్లు గుర్రుగా ఉండటమే ఆ చర్చకు కారణం. ఎన్నికల్లో ఎలాగూ గెలవలేదు. పార్టీ పుంజుకోవడానికి అవకాశం వచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేదని టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. అక్కడితో ఆగితే సరిపోదని అనుకున్నారో ఏమో.. సోషల్ మీడియా వేదికగా కూడా తెగ ఫీలవుతున్నారట. అదే ఇప్పుడు చర్చగా మారింది.
ఓడాక కేడర్‌ను.. ఇప్పుడు సమస్యలను పట్టించుకోవడం లేదా?
అమరరాజా ఫ్యాక్టరీ వివాదం రాజకీయ దుమారం రేపింది. పద్ధతి మార్చుకుంటే ఫ్యాక్టరీ ఉంటుందని.. వైసీపీ నేతలు తేల్చిచెప్పారట. టీడీపీ నేతలు ఈ వైఖరిని ఖండించారు. వేలమంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడతారని మండిపడ్డారు. అయితే స్థానికంగా ఉన్న సుగుణమ్మ, సుధీర్, నానిలు మాత్రం పెదవి విప్పలేదు. వారు లైట్ తీసుకున్నారట. ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత ఎలాగూ కేడర్‌ను పట్టించుకోలేదు. కనీసం పార్టీకి ఉపయోగపడే సందర్భంలో అయినా బద్ధకం వీడితే బాగుండేది కదా అని చర్చకు పెట్టారట.
రాజకీయంగా ఉపయోగపడే అంశంలో సైలెంట్!
అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు ఎనబైశాతం వరకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తికి చెందినా వారే. ఫ్యాక్టరీ తరలిస్తారనే ప్రచారం వారిన కలవర పెట్టింది. ఒకవేళ తరలిస్తే ఈ మూడు నియోజకవర్గల్లో పార్టీపై ప్రభావం పడుతుందని తమ్ముళ్లు లెక్కలు వేసుకున్నారట. లెఫ్ట్ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మాత్రమే నిరసన తెలిపాయి. ఎంత చేసినా రాజకీయంగా ఆ పార్టీలకు వచ్చే ఉపయోగం ఏదీ లేదు. రాజకీయంగా ఉపయోగపడే అంశంలో టీడీపీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఎవరు చేసినా క్రెడిట్ మా ఖాతాలో పడుతుందని అనుకున్నారో ఏమో నో టెన్షన్ అన్నట్టు సైలెంట్ అయ్యారు.
స్థానిక టీడీపీ నేతలను నిలదీస్తున్న ఉద్యోగులు?
పైగా అమరరాజా టీడీపీ ఎంపీ గల్లాది. ఫ్యాక్టరీ కార్మికుల కోణంలో కాకున్నా కనీసం పార్టీపరంగా నైనా స్పందించాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ దీన్ని అన్ని వేదికలమీదా ప్రస్తావిస్తోంది. దీన్నో అంశంగా అగ్రనేతలు తీసుకున్నారు. కానీ.. లోకల్ లీడర్స్‌లో చలనం లేదు. దీంతో ఆ ఇంఛార్జ్‌లు మాకెందుకు.. ఇప్పుడు అవసరమా అన్నట్టు ఉన్నారట కేడర్. నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. రెండున్నరేళ్లుగా తమ్ముళ్లను వదిలేశారు. ఇప్పుడు సమస్యలను గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. గ్రామాల్లో ఉన్న అమరరాజా ఉద్యోగులు ఈ అంశంలో స్థానిక టీడీపీ నేతలను నిందిస్తున్నట్టు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న అంశాలనే క్రోడీకరించి ఇంఛార్జులపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట తెలుగు తమ్ముళ్లు. మరి.. శ్రేణులు ప్రస్తావించిన అంశాలను చంద్రబాబు పట్టించుకుంటారో లేదో చూడాలి.