ఆయన రెండు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నారు. ఆయన పేరు చెప్పగానే పార్టీ ఏంటో.. పార్టీ గుర్తు ఏంటో ఇట్టే చెప్పేస్తారు ఆ నియోజకవర్గం జనం. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలోకి మారారు. ఎన్నికల గుర్తు కూడా మారింది. త్వరలో జరిగే ఉపఎన్నికలో మరోసారి బరిలో దిగబోతున్నారు. ఈ సమయంలో ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేయడానికి నానా తిప్పలు పడుతున్నారట ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈస్టోరీలో చూద్దాం.
బీజేపీ ఎన్నికల గుర్తును జనాల్లోకి తీసుకెళ్లడమే సవాల్?
ఎన్నికలు ఏవైనా అభ్యర్థులు తమ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అదే పాపులర్ పార్టీ అయితే పెద్దగా కష్టపడక్కర్లేదు. కాకపోతే జనాభిమానం పొంది.. పార్టీ మారిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తిప్పలు తప్పవు. హుజురాబాద్‌లో ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇదే ఇబ్బంది ఎదురవుతోందట. దాదాపు 20 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో ఉండటం వల్ల.. ఈటల పేరు చెప్పగానే నియోజకవర్గ ప్రజలకు టీఆర్‌ఎస్ గుర్తుకు రావడం సహజం. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు. ఎప్పటి నుంచో అక్కడే గెలుస్తూ వస్తుండటంతో ఈటల ఎన్నికల గుర్తు కారు అన్నది జనాల్లో బలంగా నాటుకుపోయింది. కానీ.. ఈటల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం. ఇప్పుడు బీజేపీ ఎన్నికల సింబల్‌ను ప్రజలకు పరిచయం చేయడం ఆయనకు సవాల్‌గా మారింది. ఈటలను అభిమానించేవాళ్లు ఎక్కడ కారు గుర్తుపై ఓటేస్తారోనని ఆందోళన చెందుతున్నారట.
కమలం గుర్తుపై ఓటేస్తారో లేదో అన్న టెన్షన్!
కారు గుర్తుపై ఈటల ఒకసారి రెండుసార్లు కాదు.. ఆరుసార్లు గెలిచారు. అందుకే ఈటల అంటే కారు గుర్తు గుర్తుకురావడం కామన్. ప్రస్తుతం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అభిమానులు.. అనుచరులు ఈటలకే ఓటు వేస్తామని చెబుతున్నారు కానీ.. వారు కమలం గుర్తుపై ఓటు వేస్తారో లేదో అన్న టెన్షన్ ఉందట. ఈటలపై సానుభూతిని కాపాడుకుంటూ.. ఆయనను అభిమానించేవాళ్లు.. కమలం గుర్తుపై ఓటు వేసేలా ప్రచారం చేయడానికి కిందా మీదా పడుతున్నాయి బీజేపీ శ్రేణులు. బీజేపీ కమలం గుర్తు ఉన్న గొడుగులు.. మాస్క్‌లు.. గోడ గడియారాలతో ప్రచారం ఊదరగొడుతున్నారు.
జనాలకు పదే పదే ‘గుర్తు’ చేస్తున్నారట
ఈటల ఎన్నికల గుర్తు కమలం అని ప్రత్యేకంగా అక్షరాలు రాయించి ప్రజల్లోకి వెళ్తోంది మాజీ మంత్రి అండ్ కో. జనాలతో మాట్లాడేటప్పుడు పదే పదే తమ ఎన్నికల గుర్తు కమలం అని చెబుతున్నారు. ఈటల పార్టీ మారిన విషయం తెలిసినా.. ఎన్నికల గుర్తు చెప్పేసరికి.. అవునా అని నోళ్లెళ్ల బెడుతున్నారట జనాలు. వారి రియాక్షన్ చూశాక ఈటల బ్యాచ్‌కు మైండ్ బ్లాంక్ అవుతున్నట్టు సమాచారం.
కలవర పెడుతోన్న డీకే అరుణ ఉదంతం?
గతంలోనూ కొందరు ప్రముఖులు పార్టీలు మారారు.. ఎన్నికల్లో మరో పార్టీ నుండి పోటీ చేశారు. గుర్తు మారిందని తెలియక పాత గుర్తుకే ఓటు వేసి వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో డీకే అరుణ విషయంలో ఇదే జరిగిందని చెబుతారు. ఆమె పార్టీ మారిన విషయం తెలియక అంతకు ముందు ఉన్న పార్టీకే చాలా మంది ఓటేశారట. అటువంటి పరిస్థితి హుజురాబాద్‌లో రాకుండా ఈటల, బీజేపీ నేతలు జాగ్రత్త పడుతున్నారట. ప్రధానంగా ఊర్లలో ఉండే వృద్ధులు కమలం గుర్తుపై ఓటేసేలా పదే పదే గుర్తు చేస్తున్నారట. మరి.. ఎన్నికల సమయానికి ఈ గుర్తు గందరగోళానికి ఈటల ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.