కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు.
కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ!
శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు నేతలు, అధికారులు. కేంద్రమంత్రి పర్యటనకు వారంరోజుల ముందునుంచే ఏర్పాట్లుపై ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7న నిర్మలా సీతారామన్ పొందూరు రావడం.. పర్యటన ముగించుకుని వెళ్లడం అయిపోయింది. సీన్ కట్ చేస్తే.. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలే ఇప్పుడు చర్చగా మారాయి.
కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన నేతలు!
వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా కాకుండా పొందూరు పర్యటనలో నిర్మలా సీతారామన్ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారు. నేరుగా నేతన్నలతోనే వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా చేనేత దినోత్సవ వేడుకల వేదిక నుంచి కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు అంతా నీళ్లు నమిలారు. కేంద్రమంత్రికి ఇచ్చిన వివరాల్లో 500 మంది మాత్రమే వీవర్స్ ఉన్నారని ప్రస్తావించారు అధికారులు. 1500 మంది వీవర్స్ ఉంటేనే మెగా ఖాదీ క్లస్టర్ ఏర్పాటు సాధ్యమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆ సమాధానంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కి పడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించుకుని.. పొందూరుతోపాటు చుట్టుపక్కల అంతాకలిపి 2 వేల 500 నుంచి 2 వేల 800 మంది వీవర్స్ ఉంటారని బదులిచ్చారు. ఆరువేల రాట్నాలున్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.
వేదికపైనే సిక్కోలు నేతలు, అధికారులకు కేంద్రమంత్రి చురకలు!
లెక్కల్లో కన్ఫ్యూజన్ పరిశీలించిన తర్వాత జిల్లా నేతలు.. అధికారులపై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి. పొందూరు ఖాదీని బతికించాలని అడుగుతున్నప్పుడు సరైన లెక్కలు ఉండాలి కదా? ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ఎలా ప్రశ్నిస్తారో.. అలా ఇక్కడ కూడా నిలదీయాలంటే ముందు మనదగ్గర లెక్కలుండాలి కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు నిర్మలా సీతరామన్. ఆ లెక్కలు లేకపోతే ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుసుకోవాలని వేదికపై ఉన్నవారికి చురకలు వేశారు కేంద్రమంత్రి. ఆ చురకలే అటు పొందూరులో ఇటు జిల్లాలో చర్చగా మారాయి.
కీలక సమయంలో సిక్కోలు నేతలు చేతులు ఎత్తేశారా?
పొందూరు పుట్టుపుర్వోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌లు గొప్పగా చదివి వినిపిస్తే.. ప్రస్తుత పరిస్థితులను ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వేదికపై ఉన్నవారు..సభకు వచ్చిన వారు విపక్ష ఎంపీ వెల్లడించిన చిట్టాకు చప్పట్లు కొట్టలేకుండా ఉండిపోయారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో సైతం కేంద్రమంత్రే స్వయంగా పేర్లు అడిగి తెలుసుకుని.. వాటిని అందజేశారు. సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంత కాదు.. అంతకాదు అని గొప్పులు చెప్పే సిక్కోలు నేతలు… అధికారులు సమయం వచ్చినప్పుడు చేతులెత్తేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి సమక్షంలో డొల్లతనం తెలిసిపోయింది. దీంతో … ఓస్ ఈ మాత్రం దానికేనా అంత హడావిడి అని చెవులు కొరుక్కుంటున్నారు.