కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న ఆ మాజీ మంత్రి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రజాసమస్యలపై ఏకంగా రోడ్డెక్కుతున్నారు. పోయినచోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారో.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారో కానీ.. నష్ట నివారణకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి?
హైదరాబాద్‌లో కేసు తర్వాత సొంత వర్గం దూరమైందా?
వివాదాలు, కేసుల కారణంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కొంతకాలంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు దూరంగా ఉన్నారు. క్యాడర్‌కు కూడా అందుబాటులో లేరు. ఆళ్లగడ్డలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసి భూమా అఖిల సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జనం సమస్యలపై ఆమె స్పందించిన సందర్భాలు తక్కువే. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో గట్టి ప్రయత్నమే చేశారు. కానీ.. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర, హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్ వివాదంలో కిడ్నాప్ కేసులతో మాజీ మంత్రికి నష్టం జరిగిందనే అభిప్రాయం ఉంది. ఆ ఎఫెక్ట్‌తో భూమా వర్గంలో సొంతవారే దూరమైనట్టు చెబుతారు. భూమా ఫ్యామిలీకి వాళ్ల వర్గానికి ఫ్యాక్షన్, వివాదాలు కొత్త కాదు. కానీ.. హైదరాబాద్‌లో నమోదైన కేసులో కేడర్‌కు ఇబ్బంది అనిపించిందట.
డ్యామేజీ కంట్రోల్ మొదలు పెట్టారా?
ఇలా వదిలేస్తే కేడర్ కూడా తనను వదిలి వేస్తుందని భయపడ్డారో ఏమో.. అఖిల మళ్లీ రంగంలోకి దిగారు. డ్యామేజీ కంట్రోల్ మొదలుపెట్టారు. కీలక అంశాలపై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. సామాన్య జనంతో ముడిపడిన ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో షాపుల పన్నుల పెంపు అంశాన్ని ఎంచుకున్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలపైనా ఫోకస్ పెట్టారామె. ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో షాపుల పన్ను 33 శాతం పెంచుతూ జీవో ఇస్తే ఆళ్లగడ్డలో మాత్రమే 65 శాతం పెంచారంటూ రోడ్డెక్కారు మాజీ మంత్రి.
ఆళ్లగడ్డలో షాపుల పన్ను పెంపుపై ఆందోళన
ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 250 షాపులు ఉండగా అందులో టైలరింగ్, సెలూన్ , కిరాణా, కూరగాయల షాపులు ఉన్నాయి. పేద, మధ్య తరగతి వారే వీటిల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్కసారిగా 65 శాతం పన్ను పెంచడంతో ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డికి గోడు చెప్పుకున్నారట వ్యాపారులు. అయినా సమస్య పరిష్కారం కాలేదని భూమా అఖిలను ఆశ్రయించారట. వెతకబోయిన తీగ కాలికి తగినట్టు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అఖిల అందిపుచ్చుకొన్నారు. రంగంలోకి దిగారు. షాపుల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు.
అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదులు
గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలపైనా పోరాటం మొదలుపెట్టారు అఖిల. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారంటూ మైనింగ్ ప్రాంతానికే వెళ్లి అక్రమ మైనింగ్ పై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అక్కడి నుంచే అధికారులకు ఫిర్యాదు చేసి హాల్ చల్ చేశారు. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. 2 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకున్నారని.. దీనికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని అఖిల ఆరోపించారు. వాహనాలను సీజ్ చేయకుండా వైసీపీ నేతల ఇళ్లకు పంపారని మండిపడ్డారామె. అధికారులు స్పందించకుంటే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారట మాజీ మంత్రి. అదే ఊపులో క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని చాగలమర్రిలో కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
భూమా అఖిల రోడ్డెక్కడంపై చర్చ!
కేవలం రాజకీయంగా జరిగిన నష్టాన్ని నివారించుకునేందుకే భూమా అఖిల రోడ్డెక్కుతున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కారణం ఏదైనా భూమా అఖిల రోడ్డెక్కడం చర్చకు దారితీసిందట. డ్యామేజ్ కంట్రోల్ కోసం అఖిల చేస్తున్న హడావిడి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.