ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి.
థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు వెళ్ళి పరిశీలిస్తున్నారు. అగ్నిమాపక శాఖ క్లియరెన్స్ లేకపోయినా ఉపేక్షించడం లేదు. ఏదో ఒక షో సమయంలో పోలీసుల్ని తీసుకుని వెళ్లడం, అక్కడ యాజమాన్యం లేదా సిబ్బంది ఎవరు కనిపించినా సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని కలిసి వాటిపై ప్రశ్నలు వేయడం, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏమాత్రం తేడా కనిపించినా చర్యలకు దిగడం వంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also మూడు సినిమా థియేటర్లు సీజ్. ఎక్కడంటే?
కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేస్తున్నాం అన్నారు జేసీ మాధవీ లత. ఎన్టీవీతో ఆమె మాట్లాడుతూ.. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేసాం అన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగాలేని ఒక థియేటర్ కి జరిమానా వేశాం అన్నారు. మొత్తం 134 థియేటర్లు జిల్లాలో ఉన్నాయి. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్టు ఇప్పటి వరకు గుర్తించలేదని, ఫామ్ – బీ పాటించకపోవడాన్ని మాత్రమే గుర్తించామన్నారు. తనిఖీలు ఎప్పటికప్పుడు కొనసాగుతాయన్నారు. థియేటర్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇదిలా వుంటే.. సినిమా థియేటర్లలో తనిఖీలపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రేపు విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో తనిఖీలు, సీజ్, ప్రభుత్వం తీరుపై చర్చించే అవకాశం వుందని తెలుస్తోంది. కరోనా దెబ్బకు అల్లాడిన తమపై ఎడాపెడా దాడులు చేయడంపై ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరం చెబుతున్నాయి.