భారత్ ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకోదని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్. ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నామని పాకిస్థాన్‌కి చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ సంపూర్ణ ఆధిక్యం చలాయిస్తోందని తెలిపాడు. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటంతో.. 2003, 2011 ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగామని చెప్పారు. తామెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతామని.. పాకిస్థాన్‌లా గొప్పలు చెప్పమని కౌంటర్ ఇచ్చారు.