ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు ఎస్ఈసీ.. ఎన్నికలు వాయిదా వేసిందని గుర్తు చేశారు. టీడీపీవి చిల్లర ఎత్తుగడలు అని..ప్రజాస్వామ్య ప్రక్రియ ఆగితే టీడీపీకి సంతోషం వేస్తుందంటే చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందేనన్నారు. ప్రజలు పాల్గొన్న ఎన్నికలు రద్దు అయినందుకు సంతోషపడటం జుగుప్సాకరమని మండిపడ్డారు. టీడీపీకి ప్రజా జీవనంలో ఉండే అర్హత లేదు..ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.