పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులకు రెండున్నర లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీవీతో ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడారు. బస్సు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం అన్నారు.
డ్రైవర్ హెల్త్ కండిషన్, బస్సులో లోపాలున్నాయన్న దానిపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. గ్యారేజి నుంచి బస్సు బయటకు వెళ్ళేటప్పుడే బస్ కండీషన్ చెక్ చేసి పంపుతారు. గతంలో స్టీరింగ్ లోపం అని ఎటువంటి కంప్లైంట్ రాలేదు. డ్రైవర్ కెరియర్ లో ఒక్కసారి కూడా బస్సు ఢీకొట్టినట్లు ఇతరత్రా ఫిర్యాదులు లేవు. నిన్న ఏం జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నాం అన్నారు. ఆర్టీసీ సంస్ధ తరపున మృతుల కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తున్నాం అన్నారు.
గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డ్రైవర్ కు ఆర్టీసీ నుంచి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ ఆయన కుటుంబ సభ్యులకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు మల్లిఖార్జున రెడ్డి. ఇకపై ఇలాంటి ప్రమాదలు జరగకుండా మరింత అప్రమత్తం చేస్తాం అన్నారు.