ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా దిగ్గజ కంపెనీలతో ప్రధాని సమావేశం కాబోతున్నారు. అదే విధంగా కమలా హ్యారిస్ తో కూడా ప్రధాని సమావేశం అవుతారు. సెప్టెంబర్ 24 న అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే రోజు, ఇండియా, జపాన్, అస్ట్రేలియా, అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్న “క్వాడ్” దేశాల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సెమీ కండక్టర్స్ సరఫరా లో ఏలాంటి అంతరాయం లేకుండా ఉండే అంశంపై చర్చించే అవకాశం ఉన్నది. సాంకేతిక పరికరాల ఉత్పత్తి లో అగ్రగామిగా ఉన్న చైనా కు దీటుగా, సాంకేతిక అభివృద్ధి లో పరస్పర సహకారం, నాలుగు దేశాల ప్రయోజనాల పై ప్రధానంగా చర్చ జరగనున్నది. సాంకేతికత చౌర్యం, అక్రమ సరఫరా ను నిలువరించేందుకు, ప్రజాస్వామ్య విలువలు, పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక ను అభివృధ్ది చేసుకోవడం, పంచుకోవడం లాంటి అంశాల పై సమాలోచనలు. మైక్రో చిప్ టెక్నాలజీ ని నాలుగు దేశాలు కలిసి అభివృద్ధి చేసుకునే ప్రణాళికలు రచించుకునే అంశాల పై చర్చించే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 25 వ తేదీన ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీన ప్రధాని ఇండియాకు తిరిగి వస్తారు.