ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఒంటరి జీవితం అనుభవిస్తూ బాధపడుతోంది. మినత్ పట్నాయక్ (63) అనే మహిళ భర్త 2020లో అనారోగ్యంతో మృతిచెందగా… ఓ అగ్నిప్రమాదంలో కుమార్తె కూడా ఇటీవల ప్రాణాలను విడిచింది. దీంతో వృద్ధురాలు ఒంటరిగా మారింది. అప్పటివరకు పట్టించుకోని అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెపై కపట ప్రేమను చూపించడానికి ప్రయత్నించారు. ఈ విషయం కనిపెట్టిన వృద్ధురాలు సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also: బాలల దినోత్సవం ప్రత్యేకత ఏంటి?
తన దగ్గర ఉన్న కోటి రూపాయల విలువైన ఆస్తిని రిక్షా కార్మికుడు సామల్‌కు దానం చేసింది. ఎందుకంటే సామల్ 25 ఏళ్ల పాటు తన కుమార్తెను రిక్షాలో పాఠశాలకు తీసుకెళ్లేవాడని… తనకు అత్యవసరం ఉన్న సమయాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా తెచ్చేవాడని మినత్ పట్నాయక్ తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామగ్రిని రిక్షా కార్మికుడు సామల్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. తన కుటుంబానికి సామల్ చేసిన సేవలకు ఏదో చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినత్ పట్నాయక్ పేర్కొంది. కాగా వృద్ధురాలు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.