వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి.
58 బిలియన్లు.. ఇదీ ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్. దీనిలో 87 శాతం వాటా కేవలం క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్.. ఇప్పుడు ఇండియాలో మార్కెట్ ను శాసిస్తోంది. పుట్టిల్లు ఇంగ్లండ్ ను మించిపోయి ఇండియాలో బిజినెస్ చేస్తోంది. అమెరికాలో ఫుట్ బాల్, బేస్ బాల్ క్లబ్ కంటే మిన్నగా కోట్లు కురిపిస్తోంది. ఇప్పుడు క్రికెట్ అంటే ఓ ఆట కాదు. ఓ భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్. ఐపీఎల్ వస్తుందంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. క్రికెట్ వరల్డ్ కప్ కు అనుగుణంగా ఇండియాలో ఎన్నికలను కూడా రీషెడ్యూల్ చేసిన రోజులున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే క్రికెట్ కు అంత పవర్ ఉంది. ఇక అభిమానుల్లో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు.. ఓ మతం అనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా.. అక్కడ టీమిండియా ఆడుతుంటే చాలు.. ఆ మ్యాచ్ టీఆర్పీ దగ్గర్నుంచీ టికెట్ అమ్మకాల వరకూ అంతటా రికార్డులు బద్దలవ్వాల్సిందే.
స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మన జట్టు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లు ఆడటం, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలొంచడం తరచూ చూసేవాళ్లు అభిమానులు. అప్పుడప్పుడూ అగ్రశ్రేణి జట్ల పేస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ వచ్చే మెరుపు ఇన్నింగ్స్ లు, అడపాదడపా వచ్చే గెలుపులే మహాభాగ్యంగా భావించేవాళ్లు. కానీ కాలం గడిచేకొద్దీ క్రికెట్లో టీమిండియా నైపుణ్యం పెరిగింది. మేటి ఆటగాళ్ల రాకతో క్రికెట్ పై క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కపిల్ డెవిల్స్ 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి వరల్డ్ కప్ కొట్టడం.. దేశ యువతపై చెరగని ముద్ర వేసింది.
కపిల్ డెవిల్స్ స్ఫూర్తితో చాలా మంది నైపుణ్యం గల ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. అప్పట్నుంచీ క్రికెట్ ను చూసే దృక్పథమే మారిపోయింది. అప్పడప్పుడూ గెలిస్తే చాలనే స్టేజ్ నుంచి.. ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే అని బలంగా కోరుకునే అభిమానులు పెరిగిపోయారు. ఆటగాళ్ల కంటే ఎక్కువగా మ్యాచ్ లను అభిమానులే ఎక్కువ ప్రిస్టేజ్ గా తీసుకోవడం పెరిగిపోయింది. మ్యాచ్ లో గెలిస్తే క్రికెటర్లకు హారతులు పట్టడం, ఓడిపోతే క్రికెటర్ల ఇళ్లపై దాడులు చేయడం కూడా మొదలైంది. చాలాసార్లు కీలక మ్యాచ్ ల సమయంలో క్రికెటర్ల ఇళ్ల దగ్గర భద్రత కల్పించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. క్రికెట్ పై అభిమానులు పెంచుకున్న ఈ పిచ్చే.. వేల కోట్ల రూపాయల బిజినెస్ కు బీజం వేసింది. టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ టీవీ టెలికాస్ట్ హక్కులు కోట్ల రూపాయల్లోకి చేరిపోయాయి.
క్రికెట్ స్వరూపస్వభావాల్లో కూడా చాలా మార్పులొచ్చేశాయి. వైట్ బాల్ క్రికెట్ నుంచి టీట్వంటీ లీగ్ ల దాకా అన్నింటినీ జనం ఆదరిస్తున్నారు. క్రికెట్ పై అభిమానుల్లో ఉండే ఆసక్తిని బీసీసీఐ క్రమంగా క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టింది. క్రికెట్ గేమ్ రూపాంతరం చెందుతున్న కొద్దీ.. టీమిండియా విజయాల శాతం పెరుగుతున్న కొద్దీ.. ఇండియాలో క్రికెట్ బిజినెస్ కూడా ఇంతింటై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ వచ్చింది. ఆటగాళ్లు వేసుకునే జెర్సీ దగ్గర్నుంచీ స్టేడియంలో అమ్ముడయ్యే టికెట్ల దాకా.. టెలికాస్ట్ రైట్స్ నుంచీ స్టేడియం బౌండరీ లైన్ దగ్గర కనిపించే ప్రకటనల దాకా.. అన్నీ కాసులు కురిపిస్తున్నాయి. ఒక మ్యాచ్ జరిగితే చాలు.. కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఒకప్పుడు సినిమాను బలమైన మాధ్యమంగా చెప్పుకునేవాళ్లు. కానీ క్రికెట్ విస్తృతి పెరిగిన తర్వాత.. క్రికెట్ సినిమాను వెనక్కినెట్టేసి బలమైన బిజినెస్ సాధనంగా మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్లో కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోయారు. ఓ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు పది సెకండ్ల యాడ్ చూపించినా చాలు.. తమ బిజినెస్ గణనీయంగా పెరుగుతోందనే విషయాన్ని గుర్తించిన కంపెనీలు.. ఎంత రేటైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. ఇదే వేల కోట్ల రూపాయల బిజినెస్ కు అంకురార్పణ చేసింది.
కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్ కు అతి పెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్ క్రికెట్ పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైమ్ లో టీట్వంటీ క్రికెట్ వచ్చింది. ఇక టీట్వంటీ క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం.. పటిష్ఠమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటుచేసింది. బాలీవుడ్ లో ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా.. దేశంలో వంద కోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం. కానీ క్రికెట్ మ్యాచ్ జరిగితే మాత్రం దాదాపు వంద కోట్ల మంది చూడటం గ్యారెంటీ అనేంతగా క్రికెట్ ఎదిగింది. బిజినెస్ చేయాలంటే కస్టమర్లే ముఖ్యం. ఎక్కడ కస్టమర్లు ఎక్కువ ఉంటే.. అక్కడే కాసులు కురుస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఈ వ్యాపార సూత్రాన్నే వంట బట్టించుకున్నాయి. క్రికెట్ పై అభిమానులకు ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ.. విభిన్నంగా యాడ్ లు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నాయి. తమ ప్రొడక్ట్ గురించి చెప్పే యాడ్ లో క్రికెట్ ను మిళితం చేయడం ద్వారా కోట్లాదిమందిని ఆకర్షిస్తున్నాయి.
బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఎదిగిందంటే.. దానికి కేవలం క్రికెట్ అభిమానులు, ప్రపంచవ్యాప్తగా పేరు ప్రఖ్యాతులున్న స్టార్ ఆటగాళ్లు మాత్రమే కారణం కాదు. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఓ రీజన్ అని చెప్పాలి. టీమిండియా కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్న జట్లు, దశాబ్దాల తరబడి క్రికెట్ ను ఏలిన దేశాలను కూడా ఆశ్చర్యపరిచేలా క్రికెట్ మార్కెట్ ను నిర్మించింది బీసీసీఐ. ఒకప్పుడు టీమిండియా గెలిస్తే.. ఓడితే.. జరిగే బిజినెస్ లో తేడా ఉండేది. కానీ ఇప్పుడు టీమ్ గెలుపోటములతో సంబంధం లేకుండా ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. టీమిండియా గెలిస్తేనే బిజినెస్ జరుగుతుంది అనుకునే రోజులు పోయి.. టీమిండియా ఆడితే చాలు అనుకునే స్టేజ్ వచ్చేసింది. టీమిండియా బిజినెస్ బ్యాకింగ్ చూసి.. ఐసీసీ కూడా టీమిండియా షెడ్యూల్ కు అనుగుణంగా టోర్నీలు ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా లీగ్ లో నిష్క్రమించిందంటే.. ఆ టోర్నీ బిజినెస్ ఒక్కసారిగా పడిపోతోంది. టీమిండియా నాకౌట్ స్టేజ్ కు చేరితేనే.. ఐసీసీ టోర్నీలకు అనుకున్నంత బిజినెస్ జరుగుతోంది. ఒకప్పుడు క్రికెట్ ఆడటమే రాదు అని బ్రిటిషర్లు గేలిచేసిన ఇండియా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ బిజినెస్ గా కేంద్రంగా ఎదిగింది.
ఇండియన్ క్రికెట్లో ఐపీఎల్ కు ముందు.. ఐపీఎల్ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఐపీఎల్ రాకతో క్రికెట్ బిజినెస్ ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. కేవలం మూడు గంటల వినోదం.. కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది.
ఐపీఎల్ కు ముందు కూడా ఇండియాలో క్రికెట్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది. కానీ ఐపీఎల్ వచ్చాక మార్కెట్ లెక్కలన్నీ మారిపోయాయి. చూస్తుండగానే ఐపీఎల్ బిజినెస్ ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ లీగ్ ల బడ్జెట్ ను దాటేసి.. కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ కు వచ్చిన వ్యూయర్ షిప్ 200 మిలియన్లు దాటేసి.. రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ జరిగే సమయంలో వచ్చే పది సెకన్ల యాడ్ ఖరీదు 10 నుంచి 12 లక్షలు. ఒక్క టీవీ ప్రకటనల ద్వారానే ఐపీఎల్ 2 వేల కోట్లు సంపాదిస్తోంది. 300 నుంచి 350 కోట్లు కేవలం హాట్ స్టార్లో వచ్చే ప్రకటనల ద్వారానే వస్తోంది. మొబైల్ స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్, సబ్ స్క్రైబర్ డిమాండ్.. ఇలా రకరకాల మార్గాల్లో వచ్చే సంపాదన దీనికి అదనం. ఐపీఎల్ ద్వారా ఇంత సంపాదిస్తున్న స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కుల కోసం బీసీసీఐకి చెల్లించే మొత్తం అక్షరాలా 3 వేల 200 కోట్ల రూపాయలు. ఇక ఐపీఎల్ స్పాన్సర్ల నుంచి బీసీసీఐకి 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది.
ఐపీఎల్ ఆధారంగా వచ్చిన డిజిటల్ గేమ్స్ కు కూడా మార్కెట్లో ఎక్కడలేని డిమాండ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ లపై అధికారికంగా బెట్టింగులు నిర్వహించే డ్రీమ్ లెవన్ కు కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఇలా ఇండియాలో ఐపీఎల్ చేస్తున్న బిజినెస్ చూసి.. ఇతర దేశాలు కూడా లీగులు ప్రారంభించినా.. ఏదీ ఐపీఎల్ రేంజ్ ను చేరుకోలేదు. ప్రొఫెషనల్ క్రీడలకు పెట్టింది పేరైన ఆస్ట్రేలియాలో కూడా ఐపీఎల్ తరహా లీగ్ ఉన్నా.. అక్కడ జరిగే బిజినెస్.. ఐపీఎల్ తో పోలిస్తే చెప్పుకోదగ్గది కాదు. ఐపీఎల్ బిజినెస్ టెక్నిక్స్ చూసి.. అమెరికన్ బేస్ బాల్, యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ ల యాజమాన్యాలు కూడా బిత్తరపోతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రఖ్యాత టోర్నీలకూ పెరగనంత స్థాయిలో.. ప్రతి సీజన్ కూ ఐపీఎల్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతోంది.
క్రికెట్లో టీట్వంటీ అనే ఆలోచనే వినూత్నం. కేవలం మూడు గంటల్లో మ్యాచ్ ముగిసేలా.. ప్రేక్షకులకు వినోదం అందించాలనే ఆలోచన నుంచే టీట్వంటీ పుట్టింది. ఒక్కో ఇన్నింగ్స్ కు 20 ఓవర్లు, రెండు ఇన్నింగ్స్ లమ ధ్య కేవలం పావుగంట బ్రేక్. ఆఫీసులు, కాలేజీలకు ఇబ్బంది లేకుండా సాయంత్రం సమయంలో మ్యాచ్ లు. మ్యాచ్ ల్లో సందడి చేసే ఛీర్ గాళ్స్. ఇలా ఐపీఎల్ అంటే క్రికెటైన్మెంట్ అనే రేంజ్ కు వెళ్లిపోయింది మజా. క్రికెట్ ను ఎంటర్ టైన్ మెంట్ ను మిక్స్ చేసిన అద్భుతమైన మార్కెటింగ్ ఐడియాగా ఐపీఎల్ కు పేరొచ్చింది. ఐపీఎల్ ను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఐసీసీ కూడా.. ఇప్పుడు ఐపీఎల్ కు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి.
ఐపీఎల్ సక్సెస్ కు చాలా కారణాలున్నాయి. ఓ సాధారణ టీట్వంటీ లీగ్ ను.. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చడానికి చాలా వర్కవుట్ చేశారు. మొదట దేశంలో ప్రధాన నగరాలకు అనుగుణంగా ఫ్రాంఛైజీలకు పేర్లు పెట్టారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ఒక్కో ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ ను ఓన్ గ్రౌండ్ గా ఇచ్చారు. అలా ఇండియాల నగరాల మధ్యే ఓ విధమైన పోటీ వచ్చేలా చేశారు. ఫ్రాంఛైజీలకు అనుగుణంగా ఫ్యాన్స్ కూడా ఆయా జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఐపీఎల్ లో యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంతో.. ఇతర దేశాల నుంచి స్టార్ ఆటగాళ్లను రంగంలోకి దించడంతో.. మజా మరింత పెరిగింది. ఎప్పుడో వరల్డ్ కప్ జరిగినప్పుడు మాత్రమే అన్నిదేశాల ఆటగాళ్లను చూసే అభిమానులు.. ఇప్పుడు ఐపీఎల్లో వేర్వేరు దేశాల ఆటగాళ్లను ఒకే టీమ్ గా చూడటాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా.. ఎంతమంది ఫారిన్ ప్లేయర్లు ఉండాలి.. ఎంతమంది దేశవాళీ ప్లేయర్లు ఉండాలి అనే లెక్కలు మారుతూ వచ్చాయి. ప్రతి సీజన్లో జరిగే ఆటగాళ్ల వేలం అభిమానుల్లో మరింత ఉత్కంఠం పెంచుతోంది. ఈ సీజన్లో ఓ టీమ్ కు ఆడిన ఆటగాడు.. వచ్చే సీజన్లోనూ కంటిన్యూ అవుతాడనే గ్యారెంటీ లేదు. అసలు ఏ టీమ్ లో అయినా ఉంటాడని కూడా నమ్మకంగా చెప్పలేం. ఆటగాళ్ల ఫామ్ ను బట్టి జాతకాలు మారిపోతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్ద పేరున్న క్రికెటర్లు కూడా ఐపీఎల్లో విఫలమయ్యారు. అనామకులైన ప్లేయర్లు కూడా ఐపీఎల్ తో స్టార్లైపోయారు. ప్రతి సీజన్లోనూ ఐపీఎల్ నుంచి కొత్త స్టార్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.
ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త స్టార్లు ఐపీఎల్ కు మరింత ఆకర్షణ తీసుకొస్తున్నారు. ఐపీఎల్ లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఏ టీమ్ ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ఐపీఎల్ బిజినెస్ కూడా ఊహకు అందని రేంజ్ లో జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇండియా కంపెనీలే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఐపీఎల్ పై ఎక్కడలేని ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కసారి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ వస్తే చాలు.. తమ బిజినెస్ రాతే మారిపోతుందని బలంగా నమ్ముతున్నాయి. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కు ఓ రేటు, నాకౌట్ మ్యాచ్ లకు మరో రేటు.. క్వాలిఫయర్లకు ఓ రేటు.. ఫైనల్ మ్యాచ్ కు మరో రేటు.. ఇలా మ్యాచ్ మ్యాచ్ కు ప్రకటనల రేటు మారిపోతోంది.
ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా వినిపించే మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణ. బ్యాట్స్ మెన్ ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు ఛీర్ గాళ్స్ డాన్సులు.. బౌలర్ వికెట్ తీసినప్పుడు వచ్చే ప్రత్యేకమైన మ్యూజిక్.. ఇవన్నీ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణ క్రికెట్ ప్రేక్షకులతో పాటు మ్యూజిక్ లవర్స్, ఎంటర్ టైన్ మెంట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఐపీఎల్ కు క్యూ కడుతున్నారు. ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అదో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ గా పేరు తెచ్చుకుంది. ఒక్కసారి గ్రౌండ్ లో ఎంటరైన ప్రేక్షకుడు.. మ్యాచ్ ముగిసేదాకా క్షణక్షణం ఉత్కంఠ ఫీలయ్యేలా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చూడటంలో ఐపీఎల్ విజయవంతమైంది. ఓ సినిమా చూసినంత సేపట్లో మ్యాచ్ అయిపోతుండటం, సినిమా కంటే మించిన వినోదం లభిస్తుండటంతో.. ప్రేక్షకులు కూడా ఐపీఎల్ అంటే ఎక్కడలేని ఆసక్తి చూపుతున్నారు.
కేవలం క్రికెట్ మాత్రమే చూపిస్తే బిజినెస్ జరగదు. క్రికెట్ తో పాటు ఆటా, పాటా, లేజర్ విన్యాసాలు.. ఇలా అన్నింటినీ సమపాళ్లలో రంగరిస్తోంది ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లకే కాదు.. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా వచ్చే ప్రకటనలకు రేటు వేరే లెవల్లో ఉంటుంది. అభిమానుల క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న ఐపీఎల్.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ గా మారిపోయింది.
కొన్నాళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టెస్ట్ మ్యాచ్ లకు క్రేజ్ తగ్గుతోంది. టీట్వంటీ క్రికెట్ వచ్చాక.. ఐదు రోజులు జరిగే టెస్ట్ మ్యాచ్ చూసే ఆసక్తి జనంలో తగ్గిపోయింది. కానీ టీమిండియా లెక్కే వేరు. టీమిండియా ఆడే టెస్ట్ మ్యాచ్ లు ఇప్పటికీ టీఆర్పీ రేటింగులు బద్దలు కొడుతూనే ఉన్నాయి. టెస్టులకు కూడా ఇండియా ఆడితేనే బిజినెస్ అనే పరిస్థితి వచ్చేసింది. వన్డే బిజినెస్ లో అయితే టీమిండియాకు తిరుగులేదు.
ధనాధన్ క్రికెట్ టీట్వంటీ లీగ్ లు వచ్చాక.. టెస్ట్ మ్యాచ్ లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా టెస్టులు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న యాషెస్ లాంటి టోర్నీలకు కూడా అనుకున్నంత బిజినెస్ జరగడం లేదు. కానీ ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన టెస్ట్ క్రికెట్ కు కొత్త కళ తీసుకొచ్చింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ఆ జట్టును ఓడించింది. ఆ సిరీస్ లో ప్రతి టెస్ట్ మ్యాచ్.. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది. సెషన్ సెషన్ కు మలుపులు తిరిగిన ఆట.. అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఇండియాకు సిరీస్ ఖాయం చేసిన బ్రిస్బేస్ టెస్ట్ కు రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ వచ్చింది. గత సిరీస్ తో పోలిస్తే.. ఏకంగా 33 శాతం వ్యూయర్ షిప్ పెరిగింది. ఆ దెబ్బతో టెస్టులాడే దేశాలన్నీ టీమిండియాతో సిరీస్ కు ప్లాన్ చేస్తున్నాయి. తమ దేశానికి వచ్చి టెస్ట్ సిరీస్ ఆడాలని కోరుతున్నాయి.
టెస్టులంటే బోరింగ్. ఐదు రోజులు చూస్తే కానీ.. ఎవరు గెలుస్తారో తెలియదు. అప్పటికీ చాలా మ్యాచ్ లు పేలవమైన డ్రాగా ముగుస్తాయి. ఈ రోజులకు ఇప్పుడు కాలం చెల్లింది. టెస్ట్ క్రికెట్లో కూడా పోటీతత్వం పెరిగింది. ఇక టీమిండియా ఆడే టెస్టులైతే చెప్పక్కర్లేదు. మొదట్నుంచీ స్థిరంగా ఉన్న బ్యాటింగ్ కు తోడు.. కొన్నేళ్లుగా మెరుగుపడ్డ బౌలింగ్.. ఇండియన్ టీమ్ ను టెస్టుల్లోనూ బలమైన జట్టుగా మార్చేశాయి. దీంతో ఒకప్పటిలా టీమిండియా విదేశాల్లో గెలవలేదు అనే ముద్ర చెరిగిపోయింది. ఏ దేశంపై అయినా.. ఏ దేశంలో అయినా టీమిండియా గెలవగలదనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా టెస్ట్ సిరీస్ లకు స్పాన్సర్ షిప్, టీవీ హక్కుల కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇతర దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు, టీమిండియా ఆడే టెస్ట్ సిరీస్ లకు జరిగే బిజినెస్ మధ్య చాలా తేడా ఉంటోంది.
టెస్టులకు పూర్వవైభవం రావాలంటే.. టీమిండియా వీలైనన్ని ఎక్కువ టెస్టులు ఆడాలని ఐసీసీ కూడా కోరుకుంటోంది. ఐపీఎల్ అనో, ఇంకోటనో చూడకుండా.. వీలు చూసుకుని టెస్ట్ క్రికెట్ హోదా ఉన్న అన్ని దేశాలతో మ్యాచ్ లు ఆడాలని బీసీసీఐని అడుగుతోంది. బీసీసీఐ కూడా టెస్ట్ క్రికెట్ ను నిర్లక్ష్యం చేయకుండా.. టెస్ట్ క్రికెట్ కు బిజినెస్ పెంచే పనిలో పడింది. ఇక వన్డే క్రికెట్ లో అయితే టీమిండియా బిజినెస్ కు తిరుగులేదు. కపిల్ డెవిల్స్ వరల్డ్ కప్ గెలిచిన దగ్గర్నుంచీ.. టీమిండియా వన్డేల్లో బిజినెస్ ఛాంపియన్ గా నిలుస్తోంది. ఏ కప్ లో ఏ టీమ్ గెలిచినా.. బిజినెస్ మాత్రం టీమిండియా పేరుతోనే జరుగుతోంది. దశాబ్దాలుగా ఆటగాళ్లు మారుతున్నారు కానీ.. టీమిండియాపై జరిగే బిజినెస్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
టీట్వంటీ క్రికెట్ తో పోటీ పడేలా టెస్టులు, వన్డేల్లోనూ ఎప్పటికప్పుడు నిబంధనలు మార్చుకుంటూ వస్తున్నారు. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగేలా మార్పులు చేస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీలు కూడా టెస్టులకు, వన్డేలకు వీలుగా రచిస్తున్నారు. ఐపీఎల్ రేంజ్ లో కాకపోయినా.. టెస్టులు, వన్డేలకు బిజినెస్ ఏమీ తగ్గలేదని బీసీసీఐ నిరూపిస్తోంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టెస్ట్ సిరీస్ లకు కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. టెస్ట్ క్రికెట్ బిజినెస్ గురించి బీసీసీఐ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని ఐసీసీ కూడా సభ్య దేశాలకు సూచిస్తోంది. గతంలో టెస్ట్ క్రికెట్ ను పట్టించుకోని కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఇటీవలి కాలంలో టీమిండియా సాధిస్తున్న అపురూప విజయాలతో.. మనసు మార్చుకున్నారు. టీమిండియా ఆడితే చాలు.. అది టెస్టైనా..వన్డే అయినా.. టీట్వంటీ అయినా.. డబ్బులు పెడుతున్నారు. ఇండియాలో క్రికెట్ పై పెట్టే ప్రతి పైసాకు కచ్చితంగా లాభం వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. టీమిండియా ఆడుతుంటే.. కేవలం ఇండియన్ ఫ్యాన్సే కాకుండా.. ఇతర దేశాల అభిమానులు కూడా ఆసక్తిగా చూడటం.. క్రికెట్ బిజినెస్ ను మరింతగా పెంచేస్తోంది.
ఓ సాధారణ ఆటగా మొదలైన క్రికెట్.. ఇప్పుడు దేశంలో క్రీడల బిజినెస్ ను శాసించే రేంజ్ కు ఎదిగింది. క్రికెట్ బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుందని బీసీసీఐ కూడా ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఎప్పటికప్పుడు బీసీసీఐకే షాకులిస్తూ.. బిజినెస్ ఓ రేంజ్ లో పరుగులు పెడుతోంది. ప్రతి టోర్నీకి బీసీసీఐ ఊహకు కూడా అందనంత ఆదాయం వస్తోంది. గతంలో క్రికెట్ మ్యాచ్ చూడాలంటే.. కచ్చితంగా టీవీ కావాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడున్నా మ్యాచ్ లు లైవ్ లో చూసే అవకాశం వచ్చింది. దీంతో క్రికెట్ వ్యూయర్ షిప్ కు ఢోకా లేకుండా పోయింది. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. సినిమా చూస్తారో.. చూడరో అనే సందేహం ఉంటుంది. కానీ క్రికెట్ మ్యాచ్ చూస్తారో.. చూడరో అనే డౌటే అక్కర్లేదు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందే టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయే కోట్లాది మంది అభిమానులకు కొదువలేదు. గతంలో కేవలం మ్యాచ్ మాత్రమే చూసేవాళ్లు. ఇప్పుడు మ్యాచ్ ముందు, తర్వాత వచ్చే విశ్లేషణలకు కూడా టీఆర్పీలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు విశ్లేషణల్లో అభిమానుల్ని భాగస్వామ్యం చేయడం కూడా అటు బిజినెస్ కు, ఇటు వ్యూయర్ షిప్ కు కలిసొస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న క్రికెట్ బిజినెస్.. ఇండియన్ స్పోర్ట్స్ మార్కెట్ కు గ్రోత్ ఇంజిన్లా మారిపోయింది.