ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి క్వింటానా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరుచుకుపడ్డారు. క్వింటానా నివేదిక ద్వేషపూరితమైన అపవాదుగా ఉందని, తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం తీసుకున్న స్వీయరక్షణ ఏర్పాట్లను పేర్కొన్నారని కిమ్ విమర్శించారు. తాము ఈ నివేదికను గుర్తించడం లేదని కిమ్ తెలిపారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికార మీడియా సెంట్రల్ కొరియన్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. తమ దేశంలోని పౌరుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి తామే పూర్తి బాధ్యత వహిస్తామని, తమ గురించి ఆందోళన చెందాలని ఎవరిని అడగడం లేదని ఉత్తర కొరియా తెలియజేసింది. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ఉత్తర కొరియా దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. దేశంలో కఠినమైన లాక్ డౌన్ వంటివి విధించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవ హక్కుల సంఘం పేర్కొన్న సంగతి తెలిసిందే.