పైన పటారం..లోన లొటారం. ఆ జిల్లాలో జాతీయపార్టీ తీరు అలాగే ఉందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని నాయకులు లెక్కలేస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారట. కుమ్ములాటలతో కాలక్షేపం చేస్తు.. వర్గాలను పెంచిపోషిస్తూ కేడర్‌ను కలవర పెడుతున్నారట.
ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ఎవరివారే యమునా తీరే..!
ఉమ్మడి నల్లగొండ జిల్లా. కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆయువు పట్టుగా ఉన్న ఈ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. అలాంటి జిల్లాలో పుంజుకుని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి సాయపడాలని కేడర్‌కు నూరి పోస్తున్నారు బీజేపీ నేతలు. కానీ.. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుల ఆలోచనలు.. ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల వరకు కలిసికట్టుగా సాగిన నేతలు.. ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అయ్యారు.
కేడర్ లేకపోయినా పార్టీలో మూడు వర్గాలు..!
ఎలక్షన్ ఏదైనా జిల్లాలో బీజేపీ ఏ వర్గం చేయాల్సిన పని ఆ వర్గం చేస్తుంది. కలిసి సాగే పరిస్థితే లేదు. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కంకణాల శ్రీధర్‌రెడ్డి తీరుపై పార్టీలోని మిగతా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. జిల్లా కార్యవర్గాన్ని ఏకపక్షంగా నియమించారన్నది కంకణాలపై ఉన్న ఆరోపణ. ఇక జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ల వర్గాలు వేరు. బలమైన కేడర్ లేకపోయినా జిల్లాలో మూడు వర్గాలు ఉండటం బీజేపీకే చెల్లింది.
జిల్లా అధ్యక్షుడు కంకణాలపై పార్టీలోని సీనియర్లు గుర్రు..!
పార్టీ బలోపేతానికి అప్పట్లో ఏర్పాటు చేసిన కమిటీలపై తాజా, మాజీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీంతో కంకణాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీలోని ప్రత్యర్థులు. 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు కంకణాల. అలాంటి నేతకు ఏకంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మిగతావాళ్లకు రుచించడం లేదట. పదవుల కోసం లాబీయింగ్ చేస్తారని పార్టీ సీనియర్లు ఆరోపిస్తుంటారు. బీజేపీ కార్యక్రమాలు.. సమావేశాల నిర్వహణలో సీనియర్లను సంప్రదించరన్నది కమలనాథుల ఆరోపణ.
ప్రశిక్షణ శిబిరానికి 150 మందే రాక..!
జిల్లాలోని సమస్యలపై పార్టీ నిరసనలకు పిలుపిస్తే.. బీజేపీ నేతలంతా కలిసి పనిచేసిన పరిస్థితి లేదు. ఎవరి శిబిరం వాళ్లదే. ఎవరి నినాదాలు వారివే. వర్గాలకు.. ఆధిపత్య పోరుకు ప్రాధాన్యం ఇవ్వడానికే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు నల్లగొండ కమలనాథులు. తాజాగా బీజేపీ నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రశిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. మూడురోజులపాటు జరిగిన సమావేశాలకు రాష్ట్రస్థాయి నేతలొచ్చినా.. వర్గపోరును వీడలేదు జిల్లా బీజేపీ నేతలు. మూడొందల మంది సమావేశానికి రావాల్సిన చోట కేవలం 150 మందే వచ్చారు. మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి వర్గం డుమ్మా కొట్టింది. కంకణాల వర్గం మాత్రమే హాజరైంది.
వర్గపోరు కారణంగానే నల్లగొండ టూర్‌కు ఈటల దూరం..?
ప్రశిక్షణ శిబిరానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రావాల్సి ఉంది. ఆయన వస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గపోరు కారణంగా ఈటల రాలేదని చెబుతున్నారు. జిల్లా పార్టీలో రచ్చ.. పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందట. అసమ్మతి నేతలు కూడా హైదరాబాద్ వెళ్లి తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయించారట. మరి.. జిల్లా నేతలను రాష్ట్ర నాయకులు దారిలో పెడతారో.. లేక అంతా రోడ్డెక్కంత వరకు కామ్‌గా ఉంటారో చూడాలి.