ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని వంశీ వ్యాఖ్యానించారు. ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలుసని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభ పెట్టి గెలిచారని ఆరోపించారు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటని అన్నారు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించిందని ఎమ్మెల్యే వంశీ చెప్పారు. మాజీ బాస్‌కు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎలాగో బాగా తెలుసని.. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసే చంద్రబాబుతో నలుగురు బేరం కుదుర్చుకున్నారని వంశీ విమర్శించారు.
Also Read: Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు
ఏపీలో జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు వైసీపీ, టీడీపీ తరుపు ఒకరు గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో గెలిచినప్పటికీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో సాంకేతికంగా మెజార్టీ తగ్గింది. దీంతో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. అయితే, అధికార వైసీపీ నుంచి అనూహ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. చంద్రబాబు వ్యూహం ఫలించడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.