హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని ఆరోపించారు కేటీఆర్.. అన్ని ఆధారాలున్నాయని.. ఉప ఎన్నికలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ – బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారని విమర్శించారు.. ఈ మాటను వారు కాదని చెబితే.. అందుకు సంబంధించిన సాక్ష్యాలను నేను బయట పెడతానని ప్రకటించారు.
గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందంతో ఆ రెండో పార్టీలు పోటీ చేశాయో… అదేవిధంగా ఈరోజు హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీకి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు కేటీఆర్.. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లోపాయికారిగా ఎలా కలుస్తారు? అని నిలదీశారు.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఎన్ని లోపాయికారీ ఒప్పందాలు చేసినా… కుట్రలు చేసినా.. విజ్ఞులయిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు అనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా… టీఆర్ఎస్ పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారన్నారు కేటీఆర్.