‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద’ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. దీనికి ఆయన అభిమానులంతా చప్పళ్లు.. కేరింతలతో ఆదరించారు. ఈ సినిమాలో కన్పించినట్లుగానే పవర్ స్టార్ రాజకీయాల్లోనూ దూకుడుగానే వెళుతున్నారు. సినిమాల్లో బీజీగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది.
జనసేన పార్టీ స్థాపించి దాదాపు ఏడేనిమిదేళ్లు కావొస్తోంది. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో టీడీపీ కూటమికి జనసేనాని మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే కొంతకాలానికే వీరిమధ్య బంధం బీటలువారడంతో కిందటి ఎన్నికల్లో జనసేనాని టీడీపీని దూరం పెట్టారు. తమతో కలిసిన వచ్చిన వామపక్ష పార్టీలతో జనసేనాని పొత్తు పెట్టుకొని కిందటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అనుకున్న ఫలితాలు మాత్రం రాలేదు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో పవన్ కల్యాణ్ పార్టీని నడిపస్తున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటిషన్ అంటూ ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను సైతం జనసేనాని తనదైన శైలిలో తిప్పికొట్టారు. అలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకుండా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రజలు సైతం జనసేనానికి మద్దతుగా ఉంటుండటంతో ఆయన ఓవైపు సినిమాలు చేస్తూ ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ చేయలేని ఎన్నో పనులను జనసేన పార్టీ ఒంటిచేత్తో చేస్తూ ముందుకెళుతోంది. దీంతో రాజకీయంగానూ జనసేనాని ఇమేజ్ క్రమంగా పెరుగుతూ పోతుంది.
కిందటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు ధీటుగా జనసేన ఓటింగ్ శాతం దక్కించుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను రాజకీయంగా ఎదుర్కొంటూ స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను దక్కించుకుని సత్తాచాటింది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన రోడ్ల ఉద్యమానికి ప్రజలను నుంచి భారీ మద్దతు లభించింది. దీంతో ఏపీలో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన మారుతోంది.
ఈ అవకాశాన్ని జనసేన తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా భారీ ప్లాన్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగానే జనసేనాని త్వరలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జిల్లాల వారీగా సమస్యలను తెలుసుకోవడంతోపాటు పార్టీ స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేయబోతున్నారని టాక్. ఈమేరకు జనసైనికులు సైతం ఆయా జిల్లాల వారీగా జనసేనాని పర్యటన కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి జనసేనాని జనంలో ఉండేందుకు ప్లాన్ చేసుకోవడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.