జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకును యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు సహా ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు కాల్చి చంపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఝాన్సీలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందంపై కాల్పులు జరపడంతో అసద్, గులాంలను కాల్చి చంపారు. నిందితుల దగ్గర లభించిన అత్యాధునిక ఆయుధాలు, కొత్త సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:KA Paul: సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా?
ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్ లోని తన ఇంటి బయట ఉమేష్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్, గులామ్‌లు నిందితులుగా ఉన్నారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ అనే న్యాయవాది సాక్షి. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను నిందితులు కాల్చి చంపారు. పగటిపూట జరిగిన దాడి ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు ముందు హాజరుపరిచిన రోజున అసద్ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.
సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్.. కిడ్నాప్ కేసులో గత నెలలో శిక్ష పడింది. జైలులో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో గ్యాంగ్‌స్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్‌లోని జైలుకు తరలించారు. అతను జూన్ 2019 నుండి సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. గత రెండు నెలలుగా అతిక్ అహ్మద్‌ను కోర్టు విచారణల కోసం పలుమార్లు ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు.