దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ బీమా నియంత్రణ, అధివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్నిరకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తన ఆదేశాలను గుర్తుచేస్తూ ఒమిక్రాన్ చికిత్సకు కూడా పరిహారం చెల్లించాలని బీమా సంస్ధలను ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు జారీ చేసింది.
Read Also: క్రూజ్ నౌకలో కరోనా కలకలం… ఆందోళనలో 2000 మంది ప్రయాణికులు
మరోవైపు నగదు రహిత చికిత్సలకు సంబంధించి నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. బీమా సంస్థలతో ఉన్న ఒప్పందాల మేరకు పాలసీదారులకు నగదు రహిత చికిత్స అందించడంలో ఆస్పత్రులు సైతం తగిన సహకారం అందించాలని కోరింది. కాగా దేశంలో ప్రస్తుతం 1,700కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.