జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై వున్న మోజును పెట్టుబడిగా పెట్టి.. లక్షలు కొట్టేసేందకు స్కెచ్ వేశారు. వరంగల్ పోలీసుల చేతి నుండి వారు తప్పించుకోలేకపోయారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజల మోసం చేస్తున్న ఇద్దరి గుట్టు రట్టయింది.
ఈ దొంగల నుంచి 10 లక్షల 45వేల నగదుతో పాటు,ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ బంగారు గుండ్ల హారాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బంగారం అమ్మకం ముఠాలో ఒకడైన మోహన్‌లాల్ పాత బట్టలను కొనుగోలు చేసి వాటిని కొత్తవాటిగా మార్చి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మేవాడు. ఈ వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో జల్సాలు చేసేవాడు. కరోనా వల్ల వ్యాపారం ఆగిపోయింది. జల్సాలకు డబ్బులు కావల్సి వచ్చింది.
తన బంధువైన మరో నిందితుడు ధర్మతో కల్సి బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి నకిలీ బంగారాన్ని అందజేసి డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు రెండు కిలోల రోల్డ్ గోల్డ్ బంగారం గుండ్ల హారాన్ని కొనుగోలు చేసారు. గత అక్టోబర్ 23న బెంగుళూర్ నుండి వరంగల్ కు చేరుకున్న ఇద్దరు నిందితులు ఏనుమామూల మార్కెట్ దగ్గరలో ఫెర్టిలైజర్ షాపు దగ్గరకు వెళ్లి దుకాణం యజమానితో తాము రోడ్డు పనులు చేసేందుకు వచ్చామని చెప్పి మారు పేర్లతో పరిచయం చేసుకున్నారు.
గులాబీ మొక్కలకు అవసరమైన పురుగు మందులను కొనుగోలు చేసి వారితో మాట కలిపారు. మేం రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తుండగా బంగారు గుండ్ల హారం దొరికిందని దానిని తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు. నమ్మకం కలిగించేందుకు పురుగుల మందుల వ్యాపారికి మూడు నిజమైన బంగారు గుండ్లను ఇచ్చి ఖమ్మం వెళ్లారు. వారిచ్చింది పరీక్షిస్తే స్వచ్ఛమైన బంగారమని తేలింది. దీంతో సదరు వ్యాపారి తక్కువ ధరకు పెద్ద మొత్తంలో బంగారం దొరుకుతుందని ఆశపడి అక్టోబర్ 29వ తేదీన తన భార్యతో కల్సి ఖమ్మం పట్టణంలో నిందితులకు 12 లక్షలు ఇచ్చి..వారి వద్ద వున్న 2కిలోల నకిలీ బంగారం గుండ్ల హారాన్ని తెచ్చుకున్నాడు. ఆ హారాన్ని స్వర్ణకారుడితో టెస్టు చేస్తే అది నకిలీ బంగారం తేలింది. దీంతో మోసం చేసిన వారిని వారిని కలిసేందుకు ప్రయత్నం చేస్తే అప్పటికే నిందితులు పారిపోయారు. ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఈ సంఘటనపై సెంట్రల్ జోన్ డిసీపీ పుష్పారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను గుర్తించారు. మరొకరిని మోసం చేయడానికి ఖమ్మం నుండి రైలు ద్వారా వరంగల్ రైల్వే స్టేషను నిందితులు చేరుకున్నట్లుగా సమాచారం వచ్చింది. దీంతో ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ మల్లేష్ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోని తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన మోసాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. వారి నుంచి డబ్బు, నకిలీ బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, ఇన్ స్పెక్టర్ మల్లేష్, ఎస్‌ఐ శ్రవణ్,ఇతర పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.