సీఎం కేసీఆర్ పై మారోమారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయాలనడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్టు చేయరని వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీని అణచి వేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటునారని… కానీ ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. 40 ఏళ్ల నుంచి బీజేపీ ఒక కమిటీ మెంట్ తో పనిచేస్తున్న పార్టీ అని… పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ తీరు చూసి.. టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్లు అసహ్యించు కుంటున్నారని చురకలు అంటించారు. ధాన్యం కొనుగోలు, బాయిల్ రైస్ విషయంలో కేంద్రం మీద సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రికి పాలన చాతకాకపోతే చేతులెత్తేయాలని సవాల్ విసిరారు.