కోవిడ్ కారణంగా ఆన్ లైన్ బిజినెస్ భారీగా పెరిగింది. ఫుడ్ ఆర్డర్లతో పాటు ఆన్ లైన్లో వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ఆర్డర్లు పెరిగాయి. అయితే ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిందానికి బదులుగా వేరేవి వస్తుంటాయి. ఆటవస్తువులు ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక ముక్కలు, చిత్తుకాగితాలు వస్తుంటాయి. తాజాగా ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది,
బయటకు వెళ్ళి కొనకుండా ఆన్ లైన్లో ఆఫర్లు బాగుండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు జనం. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి యాపిల్ ఫోన్ కొనాలనుకున్నాడు. ఐఫోన్13 కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా పే చేశాడు. ఇక ఫోన్ వస్తుంది.. దాంతో వీడియోలు, గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చని తెగ మురిసిపోయాడు. అయితే అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లిందా ఈ కామర్స్ సంస్థ.
అతను పెట్టిన ఫోన్ ఆర్డర్ రానే వచ్చింది. డెలివరీ బోయ్ ప్యాకేజీ అందించి అతని సంతకం తీసుకున్నాడు. ప్యాకెట్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్య పోవడం అతని వంతైంది. అందులో లక్ష రూపాయల విలువైన యాపిల్ ఫోన్ లేదట. తియ్యని వేడుక చేసుకోమన్నట్టుగా క్యాడ్బరీ చాక్లెట్ పంపించింది ఆ కంపెనీ. దీనికి సంబంధించిన ఆ కంపెనీకి ట్వీట్ పెట్టాడు. తాను ఆర్డర్ చేసిన రెండు వారాలకు ప్యాకేజీ అందిందని.. అయితే డెలివరీ అయిన ఆ బాక్స్ సీల్ తీసి ఉండడమే కాకుండా ఐఫోన్ ప్లేసులో టాయిలెట్ పేపర్ తో చుట్టిన రెండు ఓరియో చాక్లెట్ బార్ లు ఉన్నాయని తెలిపాడు. దీనిపై డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. ఐఫోన్ కి బదులు చాక్లెట్లు రావడంతో ఈ కామర్స్ కంపెనీపై మండిపడుతున్నాడా కస్టమర్. మండిపోదా మరి!