పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు.
అనిల్ రావిపూడి 1982 నవంబర్ 23న జన్మించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరి వారిపాలెం వారి స్వస్థలం. తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసేవారు. తల్లి అనంతలక్ష్మి గృహిణి. ఓ అక్క- ఇదే అనిల్ కుటుంబం. ఒకడే కొడుకు కావడం వల్ల అతని అభిలాషకు కన్నవారు అడ్డు చెప్పలేదు. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని అంశాలను చర్చిస్తూ ఎంజాయ్ చేశారు. సింగీతం శ్రీనివాసరావు, బాపు, జంధ్యాల సినిమాలంటే అభిమానం. ఇక మాస్ లో కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి చిత్రాలనూ మహా ఇష్టపడేవారు. డైలాగ్స్ దంచి కొట్టడంలో దాసరి నారాయణరావునూ మరచిపోరు. ఇలా పలు చిత్రాలు చూస్తూ సాగిన అనిల్ రావిపూడి బి.టెక్., పూర్తి కాగానే తన సమీప బంధువైన దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ చెంత చేరిపోయారు. తన కలం బలంతో తొలుత మాటలు పలికిస్తూ సాగారు. శంఖం, మిస్టర్ పర్ ఫెక్ట్, కందిరీగ, దరువు, మసాల, ఆగడు
వంటి చిత్రాలకు రచనలో పాలు పంచుకున్నారు. ఓ వైపు మాటలు రాసేస్తున్నా, మరోవైపు తన ఆలోచనలతో దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆపలేదు. సొంతగా కథ తయారు చేసుకొని, కొత్తవారిని ప్రోత్సహిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్ ను కలిశారు అనిల్. ఈయన చెప్పిన కథ ఆయనకు భలేగా నచ్చడంతో అవకాశం ఇచ్చేశారు. తత్ఫలితంగా పటాస్
తెరకెక్కింది. తొలి చిత్రంతోనే అనిల్ కు విజయం దక్కింది.
అనిల్ లోని వినోదం పంచే తీరు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చింది. వరుసగా అనిల్ తో సుప్రీమ్, రాజా ది గ్రేట్
చిత్రాలు తెరకెక్కించారు దిల్ రాజు. ఆ సమయంలో సదరు చిత్రాల హీరోలకు సరైన సక్సెస్ ఎంతో అవసరం. అది అనిల్ రావిపూడి సినిమాల ద్వారా దక్కింది. దాంతో అనిల్ పేరు చిత్రసీమలో మారుమోగింది. మధ్యలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రూపొందించిన ఎఫ్-2
కూడా జనానికి చక్కిలిగింతలు పెట్టింది. ఆ తరువాత మహేశ్ బాబు లాంటి టాప్ హీరోతో సినిమా తీసే చాన్స్ కొట్టేశారు అనిల్. మహేశ్ తో అనిల్ రూపొందించిన సరిలేరు నీకెవ్వరు
2020 సంక్రాంతికి సందడిచేసింది. దర్శకుడయిన తరువాత కూడా అనిల్ పండగ చేస్కో, గాలి సంపత్
వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. తన ఎఫ్-2
కు సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్-3
రూపొందించారు. రాబోయే ఫిబ్రవరి 25న ఆ చిత్రం జనం ముందుకు రానుంది. ఆ సినిమా తరువాత అనిల్ దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కనుందో ఇంకా తెలియదు కానీ, ఓ స్టార్ హీరోతో సినిమా ఉంటుందని వినిపిస్తోంది.
తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని కాబట్టి, సగటు ప్రేక్షకుల అభిరుచి బాగా తెలుసునని, అనేకమంది జనం కోరుకొనేది వినోదమే కాబట్టి, దానిని తన సినిమాల్లో తప్పకుండా చొప్పిస్తానని అంటారు అనిల్. కన్నవారికి ఓ మంచి భవంతి కట్టి ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూశానని, అదే అన్నిటికంటే తాను అందుకున్న పెద్ద అవార్డు అని అనిల్ భావిస్తారు. మునుముందు అనిల్ రావిపూడి తన చిత్రాలతో ఏ తీరున అలరిస్తారో చూడాలి.