ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై క్లారిటీ వచ్చింది.
Read Also: టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం
డీఎస్ చేరికపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉ.11 గంటలకు ఢిల్లీలో డీఎస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ప్రస్తుతం డీఎస్ టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంతగూటికి చేరనుండటం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి.