ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని మొత్తం కోవిడ్ మరణాల్లో సగం కేవలం ఈ నాలుగు దేశాల్లోనే సంభవించాయి. అత్యధికంగా అమెరికాలో 7.4 లక్షల మంది కరోనాతో చనిపోయారు.
Read Also: పునీత్ కళ్లతో నలుగురికి వెలుగు
మరోవైపు భారత్‌లోనూ కరోనా ప్రభావంగా ఎక్కువగానే ఉంది. ఇండియాలో కరోనాతో ఇప్పటివరకు 4.58 లక్షల మంది మృతి చెందారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికా, రష్యా వంటి దేశాల్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 30 రోజుల్లో అమెరికాలో 43వేల మంది, రష్యాలో 28వేల మంది ప్రజలు కరోనా కారణంగా చనిపోయారు. ఆ రెండు దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. కాగా 1950 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి కంటే కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు.