కరోనా కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికీ ఇంకా అనేక దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అటు ఫ్రాన్స్‌లోనూ కరోనా ఇబ్బందులు పెట్టింది. అత్యవసరంగా ప్రయాణం చేయాలి అనుకున్నా కుదరక ఉన్నచోటనే కోట్లాది మంది ఉండిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోల్డ్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఫ్రెంచ్ ఐలాండ్ తహితిలో చిక్కుకుపోయాడు. కరోనా కారణంగా విమానాలు రద్దుకావడంతో సొంత దేశానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డాడు. రెసిడెన్స్ వీసాను రెన్యువల్ చేయించాల్సి రావడంతో సాహసయాత్ర చేసైనా సరే ఆస్ట్రేలియా చేరుకోవాలని అనుకున్నాడు. వెంటనే, బోటును తీసుకొని తిహతి నుంచి సముద్ర మార్గంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. నెలరోజులపాటు 6వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అస్ట్రేలియాకు చేరుకున్నాడు. గాలులకు, అలల తాకిడికి పడవ ఎక్కడ మునిగిపోతుందో అని భయపడ్డాడట. అదృష్టవశాత్తు అలాంటిది జరగలేదని, సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నానని చెప్పాడు ఫోల్డ్.