గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా క్షమాపణలు చెప్పి, దానిని తొలగించారు. చిత్రం ఏమంటే… ఇలాంటి వివాదాలు ఇప్పుడు రోజుకు ఒకటి చొప్పున చెలరేగుతున్నాయి.
అది జరిగిన మూడు రోజులకే ‘వరుడు కావలెను’ చిత్రంలోని ‘దిగు దిగు దిగు నాగ’ పాట విడుదలైంది. నాగ దేవతను భక్తితో కొలుస్తూ పాడే జానపద గీతం మకుటాన్ని ఈ సినిమాలో ఫక్తు కమర్షియల్ సాంగ్ కు ఉపయోగించడాన్ని హిందూ సంస్థల ప్రతినిధులు తప్పు పట్టారు. మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళను కలిసి మొర పెట్టుకున్నారు. దర్శక నిర్మాతలు సానుకూలంగా స్పందించి, ఆ పాటలోని పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇది జరిగిన మర్నాడే… మరో వివాదం! ఈ సారి ‘మహా సముద్రం’లోని స్పెషల్ సాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. ఇటీవల ఈ సినిమాలోని ‘హే రంభ… హే రంభ’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒక్క వేలితో కొండనెత్తాడే…. ఒంటిచేత్తో ఆంజనేయుడే సంజీవనీ ఎత్తుకొచ్చాడే, మనం అంత గొప్పోళ్ళం కాదు… ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా!?’ అంటూ పాట సాగడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ళను తమతో పోల్చుకుంటూ మందు బాబులు ఈ పాట పాడటం సరి కాదంటూ విమర్శిస్తున్నారు. శనివారం నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ను కలిసి నిర్మాతతో మాట్లాడి ఈ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించేలా చేయమని కోరారు. హిందు సంస్థల ప్రతినిధులతో పాటు నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణీ సైతం వీరితో ప్రసన్నను కలిశారు. దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన వివరణ తమకు ఏ మాత్రం సమంజసంగా అనిపించలేదని ఆమె అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని సినిమా వారు భావించరని, ఏదైనా పొరపాటు నిజంగా జరిగితే తప్పకుండా సరి చేసుకునేలా చేస్తామని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న హామీ ఇచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జనం ఇప్పుడిప్పుడే ధైర్యంగా థియేటర్లకు వస్తున్నారు. మరి ఈ సమయంలో దర్శక నిర్మాతలు అనవసరమైన వివాదాలకు తావ్వు ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ హాయిగా థియేటర్లకు వచ్చేలా చేస్తే వారికే మంచిది.