ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో సభకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఇంద్రవెల్లి బహిరంగసభ వేదికగానే.. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో తర్వాతి సభ ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఇతర కారణాలతో ఆ వేదిక కాస్తా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోయింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో ఇవాళ దళిత, గిరిజ న ఆత్మగౌరవ దండోరా సభను జరగనుంది.. ఇంద్రవెల్లి తరహాలోనే ఇక్కడికి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు తరలివస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీల చైర్మన్లు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొంటారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ… సభాప్రాంగణంలో అంబేద్కర్, దొడ్డి కొమురయ్య, కుమురంభీం విగ్రహాలను ఏర్పాటు చేశారు.. రావిర్యాలలో మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు చేశారు.. మూడు వేదికలు, 15 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.. మొత్తంగా లక్షా 50 వేల మందికి పైగా ప్రజలు తరలివస్తారని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.. ఇక, సభకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా బెంగ్లూర్ గేట్ నుంచి తుక్కుగూడ వరకు సుమారు 100 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు.. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మల్‌రెడ్డి సోదరులు తదితరులు.