ఏపీలో అధికారపార్టీని విమర్శించే స్వంత పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దాడులు చేయడం జన్మ హక్కుగా వైసీపీ వ్యవహారిస్తోంది.సీఎం జగన్ స్పందించి, సుబ్బారావుపై దాడికి పాల్పడిన వ్యక్తుల చేత గుప్తా కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. సుబ్బారావుపై దాడి చేసిన వారిని పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టించి, పోలీసుల చేత అరెస్టు చేయించాలి. దాడులతో భయోత్పాతం సృష్టిస్తే అడ్డుకట్ట వేయడానికి బీజేపీ సిద్దంగా ఉంది.పార్టీకి సేవ చేసి, మీకు ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? ఎవరిని అణచి వేయాలని చూస్తున్నారు? సేవాపరంగా ఆర్యవైశ్యులను మించిన వారు లేదనేది జగమెరిగిన సత్యం. అలాంటి వారి జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇటీవల సుబ్బారావు గుప్తా హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సుబ్బారావుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కొద్దిరోజులు కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి బాలినేని తనపై దాడి చేయించడం వార్తలను ఖండించారు సుబ్బారావు. సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ ఈ రచ్చకు కారణం అని చెప్పారు సుబ్బారావు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.