ఉద్యోగుల పీఆర్సీతో పాటు హెల్త్ కార్డుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుపై నియమించిన కమిటీ నివేదిక అందింది జూన్ లోగా దీనిపై సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పెరిగిన పీఆర్సీ, 5 డీఏ బకాయిలు అన్ని ఆర్థిక ప్రయోజనాలు జనవరి 2022 నుంచే చెల్లిస్తామని తేల్చి చెప్పారని. 1.28 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది 50 వేల మంది ప్రభుత్వంలో చేరారన్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఆర్ధికంగా భారమేనని, ఇన్ని కష్టాలు ఉన్నా సీఎం 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని వెల్లడించారు.
ఉద్యోగులు అడక్కుండానే ఇళ్ల స్థలాలు, ఉద్యోగ విరమణ వయస్సును పెంచారని, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ ఇచ్చి జులై జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. అయితే ఇందులో కొందరు అనవసరంగా అపోహలు పడుతున్నారని, అందరికీ ఒకే దఫా ప్రొబేషన్ ఇస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నామన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత జీతాలు తగ్గుతాయని, ఇబ్బందులు వస్తాయని దుష్ప్రచారం ప్రచారం జరుగుతోందన్నారు. ఇది సరికాదని స్పష్టం చేస్తున్నామని, ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వాటిని సరి చేస్తుందని ఆయన తెలిపారు.