రంజాన్ పండగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్, అక్షయ తృతీయ వంటి రాబోయే పండుగల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆర్ కె విశ్వకర్మ మరియు ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఫీల్డ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మత స్థలాల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని డీజీపీ విశ్వకర్మ తెలిపారు. రాబోయే ఉత్సవాల కోసం చేసిన సన్నాహాల వివరాలను అన్ని జోన్/రేంజ్/జిల్లా స్థాయి అధికారుల నుంచి తీసుకుని, రద్దీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు నిరంతరం గస్తీ నిర్వహించాలని, సీనియర్ అధికారులు కూడా ఇందులో పాల్గొనాలని డీజీపీ విశ్వకర్మ ఆదేశించారు.
Also Read:Karnataka Elections: ఎన్నికల్లో ధన ప్రవాహం.. రూ.200 కోట్ల నగదు స్వాధీనం
మతపరమైన కార్యక్రమాలు, పూజలు తదితరాలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే జరిగేలా చూడాలని క్షేత్రస్థాయిలో నియమించిన సంబంధిత అధికారులందరినీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. తగిన అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపు లేదా మరే ఇతర ఊరేగింపును బయటకు తీయకూడదని సర్కార్ తెలిపింది. సంప్రదాయంగా జరిగే మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనవసర అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది.సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే ప్రయత్నాలకు తక్షణమే స్పందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడి భద్రత మనందరి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. రంజాన్ మాసం కొనసాగుతోందన్నారు. ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్, అక్షయ తృతీయ, పరశురామ జయంతి ఒకే రోజు జరుపుకునే అవకాశం ఉందని ప్రసాద్ చెప్పారు. ఇప్పుడున్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రసాద్ సూచించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read:Maharashtra: అజిత్ పవార్ బీజేపీలో చేరితే.. ఏక్నాథ్ షిండే సర్కార్ ఉంటుందా?