ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్యం, డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల అధికారుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాకటలో నగదు పంపిణీ ఎక్కువగా ఉంది. అధికారుల సోదాల్లోనూ కోట్లాది రూపాయలు దొరుకుతున్నాయి. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో భారీగా మద్యం, డబ్బును సీజ్ చేశారు.
Also Read: AIADMK: కర్ణాటక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పోటీ.. బీజేపీతో పొత్తుకు బీటలు?!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి 29 నుంచి అమలులోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో 10 లక్షల లీటర్లకు పైగా మద్యం సహా మొత్తం రూ.200 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 204 కోట్లు. ఇందులో నగదు రూ. 77 కోట్లు, మద్యం (రూ. 43 కోట్లు), బంగారం, వెండి (రూ. 50 కోట్లు), ఫ్రీబీలు (రూ. 20 కోట్లు), డ్రగ్స్/నార్కోటిక్స్ (రూ. 15 కోట్లు) ఉన్నాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. జప్తులకు సంబంధించి 1,629 కేసులు నమోదు చేశారు. మే 10న అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు మొత్తం రూ.58 కోట్లు (మార్చి 9 నుంచి మార్చి 27 వరకు) పోలీసులు పట్టుకున్నారు.