అమెరికా బలగాలు ఉపసంహరించుకున్నాయో లేదో.. ఆఫ్గనిస్తాన్‌లో అప్పుడే కల్లోలం. తాలిబన్ల చేతుల్లోకి దేశం ఇంకా పూర్తిగా వెళ్లనే లేదు… అప్పుడే అట్టుడుకుతోంది. బాంబు పేలుళ్తో దద్దరిళ్లుతోంది. ఇంకా ఏమేం చూడాలో తెలియక ఆఫ్గన్లు వణికిపోతున్నారు. తాజా పేలుళ్ల పాపం తాలిబన్లదు కాదు. కానీ దాని మీద కక్షతో ఇస్లామిక్ స్టేట్ చేసిన పని అది. ఐఎస్ ఆఫ్ఘన్ శాఖ ఇస్లామిక్ స్టేట్ -ఖోరాసన్ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. అయితే అది ఎవరిని టార్గెట్ చేసి దాడులకు దిగింది? అమెరికా సైనికులా? లేదంటే ఆఫ్గన్ పౌరులనా? అంటే ఇద్దరినీ అనే సమాధానం వస్తోంది. అయితే ఇందులో తాలిబాన్ల పాత్ర ఉందా లేదా అన్నది తెలియాల్సి వుంది. బాహుశా ఉండకపోవచ్చనే అంటున్నారు విశ్లేషకులు.
తాలిబాన్లకు.. ఇస్లామిక్ స్టేట్‌తో మునపటి దోస్తానా లేదు. అంతే కాదు ఇప్పుడవి శత్రువులు కూడా . అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడాన్ని ఇస్లామిక్ స్టేట్ జీర్ణించుకోలేకపోతోంది. తాజా పరిణామాలు దానికి పిచ్చెక్కిస్తున్నాయి. తాలిబన్లది జిహాద్ గెలుపు కాదు.. బేరసారాలాడి తెచ్చుకున్నదని, అందుకే అమెరికాకు ఎలా కావాలో అలా ఆడుతోందని ఆరోపిస్తోంది.
ఆఫ్గనిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు బలంగా లేదు. ఒకప్పుడు దానికి తూర్పు ఆఫ్గనిస్తాన్‌పై గట్టి పట్టుండేది. అయితే దానికి ఈ పరిస్థితి దాపురించటంలో తాలిబాన్లది కీలక పాత్ర. తాలిబాన్లు, ఆఫ్గన్ దళాలు ఒకే సారి విరుచుకుపడటంతో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్టే. ఆ ప్రాంతంపై మునపటి పట్టును కోల్పోయింది. అందుకే తాలిబాన్లు అమెరికాతో చేతులు కలిపారని ఇస్లామిక్ స్టేట్ మండిపడుతోంది. 2020 ఫిబ్రవరిలో అమెరికా – తాలిబాన్లు ఓ అంగీకారానికి వచ్చారు. దాని ప్రకారం అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఇతర గ్రూపులు ఉపయోగించకూడదు. అది ఇస్లామిక్ స్టేట్‌కు కంటగింపుగా మారింది. ఆఫ్గన్‌లో జిహాద్ కంటిన్యూ అవుతుందని తేల్చింది. ఇస్లామిక్ స్టేట్ తాజా దాడులు అందులో భాగమే అనుకోవచ్చు.
ఆఫ్గనిస్తాన్‌లో ఐసిస్ జిహాద్‌ని ఉదృతం చేసేందుకు 2015లో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఏర్పడింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియాలోని కొన్ని భూ భాగాలను చరిత్రలో ఖొరాసన్ అనేవారు. రెండూ ఇస్లామ్ ఛాందసవాద ఉగ్ర సంస్థలే అయినప్పటికీ వాటి బౌండరీలలో తేడావుంది. ఇస్లామిక్ స్టేట్ ఒక దేశానికి పరిమితం కావాలనుకోదు. ప్రపంచం మొత్తం జిహాద్ చేయాలంటుంది. అన్ని ముస్లిం దేశాలలో షరియా అమలు చేయటమే దాని లక్ష్యం. అయితే తాలిబాన్లు అంతవరకు వెళ్లరు. అఫ్గానిస్తాన్ వరకే పరిమితమయ్యారు. విదేశీ ఆక్రమణల నుంచి దేశానికి విముక్తి కల్పించడమే వారి లక్ష్యం. అన్ని విదేశీ బలగాలూ తమ దేశం వదిలి వెళ్లిపోవాలని తాలిబాన్లు చాలా కాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక మత పరంగా కూడా రెండు గ్రూపుల మధ్య తేడా వుంది. రెండూ సున్నీ ఉగ్రవాద సంస్థలే అయినప్పటికీ అందులో అవి అనుసరించే శాఖలు వేరు.
ఖొరాసన్ ప్రావిన్స్ కేంద్రంగా ఐఎస్ -కె పని చేస్తోంది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమెనిస్తాన్లలో దీని ఉనికి ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని జిహాదీ సంస్థల కన్నా ఇది మరింత డేంజర్. అత్యంత భయానకం, ప్రమాదకారి. ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేస్తుంది. ఐసిస్ ఖొరాసన్ జిహాదీల మెయిన్ టార్గెట్ తాలిబన్లు. అందుకే ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతికి వెళ్లిన వెంటనే నరమేధానికి పాల్పడుతున్నారు.
తాలిబన్లు కాబూల్‌ని స్వాధీనం చేసుకున్న వెంటనే ఫుల్-ఎ-చర్కి జైలులో ఉన్న టెర్రరిస్టులను రిలీజ్ చేసింది. వారిలో అల్‌ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్ కు చెందినవారు కుడా ఉన్నారు. వారు సంవత్సరాల పాటు జైల్లలో మగ్గారు. ఇప్పుడు బయటకు రాగానే ఇలా తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని అమెరికా అనుమానిస్తోంది. అయితే ఈ నరమేధం తాజా దాడులతోనే ఆగవంటోంది అమెరికా. దేశంలోని వివిధ ప్రాంతాలలో మరిన్ని దాడులు జరుగుతాయని బ్రిటన్ కూడా హెచ్చరిస్తోంది. కాబూల్ లోనే మరిన్ని ఆత్మాహుతి దాడులకు అవకాశముందని అమెరికా ఆందోళన చెందుతోంది. మరోవైపు, కాబూల్ ఎయిర్‌పోర్ట్ దరిదాపుల్లోకి వెళ్లవద్దని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దేశాల ప్రజలను అప్రమత్తం చేసిన కొన్ని గంటల్లోనే దాడులు జరగటం షాక్ కి గురిచేస్తోంది.
ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌లో 1000 మందికి పైగా అమెరికా పౌరులు ఉన్నారు. వారిని స్వదేశానికి తరలించే కార్యక్రమం కంటిన్యూ అవుతుందని అమెరికా అధికారులు చెప్పారు. ఇదిలావుంటే, దాడులు జరిగిన ప్రాంతం ప్రళయాన్ని తలపిస్తోంది. ఘటనా స్థలం చుట్టు పక్కల ఎటు చూసినా క్షతగాత్రులే ..రక్తం కారుతున్న ముఖాలు ..నెత్తురోడుతున్న శరీరంతో జనం పరుగులు పెట్టటం కలచివేస్తోందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ నరమేధానికి బలైన వారిలో పిల్లలు.. మహిళలు ఉన్నారు. మరోవైపు, ఇంకెన్నా ఆత్మాహుతి దాడులు చూడాల్సి వస్తోందోనని ఆఫ్గను ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.