ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాలిబన్ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు కూర్పు నచ్చకనే ఆ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముల్లా మహమ్మద్ హసన్ ప్రధాని అయ్యారు. అదే విధంగా, ప్రభుత్వంలో హుక్కానీలకు పెద్దపీట వేస్తూ పదవులు అప్పగించారు. గతంలో దోహాలో జరిగిన సమావేశంలో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్ధుల్లా వంటి ప్రముఖులకు ప్రభుత్వంలో స్థానం కల్పించాలని, వారి విలువైన సేవలు దేశానికి చాలా అవసరమని ఒప్పందం జరిగింది. అయితే, ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టి హుక్కానీలకు పెద్దపీట వేయడం, హమీద్ కర్జాయ్, అబ్ధుల్లా అబ్ధుల్లా లకు స్థానం కల్పించక పోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటులో పాక్ ఐఎస్ఐ జోక్యం చేసుకోవడంతో బరాదర్ కాబూల్ విడిచి కాందహార్ వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన మీడియాలో, ప్రెస్ మీట్‌లలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే లుకలుకలు మొదలుకావడంతో తాలిబన్లు ఎంతకాలం పరిపాలిస్తారో చూడాలి.