నేడు నందిగామలో సీఎం చంద్రబాబు పర్యటన..
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక, ఉదయం 10:15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకోనున్నారు. హెలిప్యాడ్ దగ్గర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 11:46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అయితే, అక్కడ విద్యార్థులకు సీఎం చంద్రబాబు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక, మధ్యాహ్నం 2:15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జ్ స్థలం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యా్హ్నం 3:40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే, సాయంత్రం 4:05 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.
నేడు భద్రాచలం వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు (ఏప్రిల్ 5న) భద్రాచలం వెళ్ళనున్నారు. రేపు భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్క రోజు ముందుగానే ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు. ఇక, భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం ఇవ్వనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇక, రేపు (ఏప్రిల్ 6న) జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్పిస్తారు. అలాగే, రేపు సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి హైదరాబాద్ లోని తన నివాసానికి ఆయన చేరుకోనున్నారు. దీంతో పాటు రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు భద్రాచలం వస్తుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
విశాఖలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్!
విశాఖపట్నంలో మేయర్ పై అవిశ్వాసం తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. GVMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా “తీర్మానం” కోసం సమావేశం పెట్టామని సమాచారం.. దీంతో మేయర్ పై GVMC అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని.. వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తనకు అందిన అజెండాలో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదంటున్నారు కార్పొరేటర్లు.
అలర్ట్.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్..
బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. మహేశ్, ఉమా.. వారి పిల్లలు రిషి, చైతు, శివన్ సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్ అరెస్ట్..
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫారెక్స్ సేవలు, మనీ ట్రాన్స్ఫర్‌ల ద్వారా డబ్బులను దేశం వెలుపలికి తరలిస్తూ ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్న ముగ్గురు నైజీరియన్లు హైదరాబాద్‌లోనే నివాసముంటూ డ్రగ్స్ రాకపోకల్ని నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ప్రస్తుతం ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా… గతేడాది ఫిబ్రవరిన దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నేరగాడిని టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందా కొనసాగిస్తున్నాడు. కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలను రవాణ చేసి తీసుకువస్తున్నాడు. గోవా నుంచి వాటిని హైదరాబాద్‌కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇతన్ని టీన్యాబ్ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద పట్టుకోవడంతో మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఇలాగే చాలా మంది నైజీరియన్స్ డ్రగ్స్ మాఫీయాలో మునిగి తేలుతున్నారు. తాజాగా మారో ముగ్గురు పట్టుబడ్డారు.
చైనా ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఆగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. తామేమీ తక్కువ కాదని నిరూపించింది. తాము కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా భయపడిందని.. తప్పుడు నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. వాళ్లకు మరొక మార్గం లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అమెరికా విధించిన సుంకాలను చైనా తీవ్రంగా తప్పుపట్టింది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అమెరికా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా పేర్కొంది. అమెరికా విధించిన సుంకాలపై పలు దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. స్నేహం చేస్తూనే.. మిత్ర దేశాలపై ఇలా సుంకాలు విధించడం సరైంది కాదని ఆయా దేశాలు పరోక్షంగా నిరసన వ్యక్తం చేశాయి.
విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’
సూపర్ స్టార్ రజినీకాంత్.. 7 పదుల వయస్సు దాటిన ఇప్పటికి సౌత్ ఇండియా లోని అందరు హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అనే వార్త రాగా, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో ఈ మూవీ కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్,టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉన్నాయట. సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.40 కోట్ల రూపాయలకు జరిగినట్లు తెలుస్తుంది. అదే విధంగా OTT నెట్ ఫ్లిక్స్ సంస్థకు ‘కూలీ’ దాదాపుగా రూ.125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ. 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం.
అదుర్స్ 2 అంటే భయం వేస్తుంది..
ఎన్టీఆర్ కెరీర్‌లో ఆయన చేసిన ‘అదుర్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరోటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చేప్పోచ్చు. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామోడి ఈ మూవీని మరింత విజయవంతం చేసింది. ఇప్పటికి కూడా ‘అదుర్స్’ వస్తుంది అంటే కొత్త మూవీ గా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అయితే కొద్ది రోజుల క్రితం ‘అదుర్స్ 2’ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై స్పందించారు ఎన్టీఆర్. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ‘దేవర 2’ తప్పకుండా ఉంటుందని.. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘NTR Neel’ మూవీ కారణంగా లైనప్‌లో మార్పులు జరిగాయని తెలిపారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు.