నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు సీఎం. పది సూత్రాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. అలాగే, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరిగు పయనంలో అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు.
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు!
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేయనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,000 జరిమానా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ. 1000 ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడితే రూ.10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి కేసులలో 1000 రూపాయల వరకూ జరిమానా విధిమని ఏపీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉందన్నారు.
చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు జీపీఆర్ (GPR), అక్వా ఐ లను ఉపయోగిస్తున్నారు. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. SLBC టన్నెల్ వద్ద పూర్తి ఆంక్షలు విధించారు. అవాంఛిత వ్యక్తులు లోపలికి వెళ్లకుండా పోలీస్ భద్రత పెంచారు. రెస్క్యూ బృందాలకు అంతరాయం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కోలుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఒక రోజు చికిత్స పొందిన అనంతరం ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ కేసులో నిందితులైన డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు సామెల్, అలాగే సామెల్ స్నేహితుడు, ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సూత్రధారులు ఫ్లోరా, సామెల్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నితీష్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు.. బీజేపీకి 100, జేడీయూకి 90 సీట్లు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. మరోసారి బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈసారి కూడా బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీయే కూటమి ఎన్నికల బరిలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే ఊహాగానాలను పక్కనపెట్టి, రాబోయే ఎన్నికల్లో నితీష్ నాయకత్వం వహిస్తారని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఎన్నికల తర్వాత సీఎం తానే కావాలా..? లేక వేరెవరినైనా నియమించాలనే విషయంపై నితీష్ కుమార్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజల మూడ్‌ని తెలుసుకునేందుకు బీజేపీ బీహార్‌లో సర్వే చేస్తోంది. సర్వే ఫలితాల ఆధారంగా ఎన్డీయే మిత్ర పక్షాల మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం ఉంది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను, బీహార్‌లో రిపీల్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ప్రతీ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తోంది.
రసాభాసగా ట్రంప్-జెలెన్స్కీ మీటింగ్.. తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..
ఖనిజ ఒప్పందం, ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే, ఓవర్ ఆఫీస్‌లో ట్రంప్, జెలెన్క్కీ భేటీలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భేటీ వాగ్వాదంతో ముగియడంతో అక్కడ ఉన్న అంతర్జాతీయ మీడియా విలేకరులతో పాటు ఇరు దేశాల దౌత్యవేత్తలు అసంతృప్తికి గురయ్యారు. ఈ భేటీ తర్వాత యుద్ధానికి అడ్డుకట్ట పడుతుందని ఆశించిన వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇరు నేతల మధ్య వాడీవేడీగా వాగ్వాదం జరుగుతున్న సమయంలో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారితో పాటు, ఉక్రెయిన్ దౌత్యవేత్తల ముఖాలు ఆవేశంగా కనిపించాయి.
ట్రంప్‌కి షాక్.. జెలెన్స్కీకి యూరప్ నేతల మద్దతు..
వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు బిగ్గరగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలతో సమావేశంలో పాల్గొన్న దౌత్యవేత్తలతో సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. జెలెన్స్కీ అమెరికాని అగౌరపరిచారంటూ, యుద్ధం ఆగడం అతడికి ఇష్టం లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అమెరికా ఒక హంతకుడు(పుతిన్)కి మద్దతుగా నిలువొద్దని జెలెన్స్కీ సూచించాడు. ఇదిలా ఉంటే, ఈ పరిణామాల నేపథ్యంలో యూరోపియన్ నాయకులు జెలెన్స్కీకి అండగా నిలుస్తున్నారు. ఉక్రెయిన్‌కి తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటిస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రష్యాను దురాక్రమణదారు అని పిలిచి, గౌరవం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కి మద్దతు ఉంటుందని చెప్పారు. స్పెయిన్, పోలాండ్ ప్రధానులు కూడా జెలెన్స్కీకి మద్దతు ప్రకటించారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్, జర్మనీ మరియు యూరప్‌పై ఆధారపడొచ్చని చెప్పారు.
ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు ముంబై ఇండియన్స్ విలవిల
శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ 49 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేయగా, షెఫాలి వర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేసి ఢిల్లీకి గొప్ప ఆరంభాన్ని అందించారు. వారిద్దరూ కేవలం 59 బంతుల్లో 85 పరుగులు చేశారు.