ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. మరో వ్యక్తి అరెస్ట్..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు భాస్కర్.. సిమెన్స్ సంస్థ రూపొందించిన ప్రోగ్రామ్ అసలు ధర 58 కోట్లు ఉంటే దానిని 3300 కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టినట్టు భాస్కర్ అండ్ కోపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడినట్టు సీఐడీ చెబుతోంది. 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వాని వాటా కింద 371 కోట్లు కొట్టేసినట్టు సీబీఐ గుర్తించింది.. సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం పూర్తిగా మార్చేసిన భాస్కర్ అండ్ కో.. 3300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371 కోట్లు ఇవ్వాల్సి ఉండగా… ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి… ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా 371 కోట్ల వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసే విధంగా ఎంవోయూను మార్చేశారట భాస్కర్.. యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించుకునేందుకు అప్పటి సీఈవో సుబ్బారావుతో లాలూచీ పడ్డారని అభియోగాలున్నాయి.. ఇక, తన భార్యను డిప్యూటీ సీఈవోగా నియమించుకునే సమయంలో తమకు ఈప్రాజెక్టుతో సంబంధం ఉందని ఎక్కడా ప్రకటించలేదు భాస్కర్ దంపతులు.. ప్రభుత్వ నిధులు విడుదలయ్యేందుకు ప్రాజెక్టు విలువను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించుకునేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ద్వారా ప్రాజెక్టును స్టడీ చేయించారు.. సెంట్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రాజెక్టు విలువను పెంచుకున్న భాస్కర్.. నిధులను దారి మళ్లించేందుకు ఆప్టస్ హెల్త్ కేర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..
టెలికం రంగంలో సత్తా చాటుతూ వస్తున్న రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ నెట్‌వర్క్ లోనూ దూకుడు చూపిస్తోంది.. 5జీ నెట్‌వర్క్‌ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది టవర్లను ఏర్పాటు చేయనున్న ప్లాన్‌లో జియో ఉంది.. మార్చి 21న భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది జియో.. ఇక, అక్కడ నుంచి క్రమంగా సిటీలు, టౌన్‌లకు విస్తరిస్తూ వస్తుంది.. అత్యంత వేగవంతమైన మరియు విశాలమైన 5G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సుమారు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జియో.. ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టింది. దేశంలో 5G టెలికాం టవర్లను ఏర్పాటు చేయడంలో భారతీ ఎయిర్‌టెల్ రెండవ స్థానంలో ఉంది. టెలికాం డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, టెలికాం టవర్ల ఏర్పాటులో రెండవ స్థానంలో ఉన్న కంపెనీ ఎయిర్‌టెల్ కంటే జియో దాదాపు ఐదు రెట్లు ముందు ఉన్నట్టు పేర్కొంది. భారతి ఎయిర్‌టెల్ మొత్తం 22,219 బీటీఎస్‌లను ఇన్‌స్టాల్ చేసింది. గురువారం నాటికి, జియో ప్రతి బేస్ స్టేషన్‌కు మూడు సెల్ యూనిట్లను కలిగి ఉండగా, ఎయిర్‌టెల్ రెండు సెల్ యూనిట్లను కలిగి ఉంది. ఎక్కువ టవర్లు మరియు సెల్ యూనిట్లు ఉన్నందున, ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో యొక్క ఇంటర్నెట్ యొక్క గరిష్ట వేగం సెకనుకు 506 మెగాబైట్‌లు (MBPS)తో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్ 268 MBPS వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. అంతకుముందు, మార్చి 21న రిలయన్స్ జియో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5Gని భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో విడుదల చేసింది. ఈ కొత్త నగరాల చేరిక తర్వాత, జియో ట్రూ 5G నెట్‌వర్క్ ఇప్పుడు దేశంలోని 406 నగరాలకు చేరుకుంది. దేశంలోని 400 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మొదటి కంపెనీగా నిలిచింది జియో. ఈ విషయంలో మిగతా టెలికాం కంపెనీలు చాలా వెనుకబడి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
ఢిల్లీలో సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డులు అందుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్.. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు వచ్చింది.. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్‌లో బాగా పనిచేస్తున్నారు.. ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు అని ప్రశంసించారు.. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను.. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారని తెలిపారు బండారు దత్తాత్రేయ. ఇక, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది.. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు.. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95శాతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందన్నారు. మరోవైపు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు.. కానీ, స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు.. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు.. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉందన్నారు. పర్యాటక, సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.. ఇక, చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. కాగా, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రేమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ సంసాద్ రత్న అవార్డులను అందజేస్తోంది..
400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులను నిర్మిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను నిర్మాణాలు చేస్తోంది. ఇందు కోసం కోట్టాది రూపాయాలు కూడా ఖర్చలు చేస్తున్నారు. అయినా.. రోగులకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు మాత్రం ఉండడం లేదు. రూ.400 కోట్లతో నిర్మించిన ఓ ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ జిల్లాలో అతిపెద్ది. అక్కడ ఇటీవల 1,000 పడకల ఆసుపత్రిని నిర్మించారు. అయితే, శ్రీకిషన్ ఓజా (65) అనే వృద్ధుడికి కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రికి వచ్చిన ఒక వృద్ధుడిని స్ట్రెచర్ లేకపోవడంతో ఆయనను ఒక గుడ్డ ముక్కపై కూర్చున్నప్పుడు నేలపైకి లాగవలసి వచ్చింది. జయరోగ్య ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించిందీ దృశ్యం. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో వృద్ధుడి బంధువు అయిన మహిళ.. ఆయనను తెల్లటి బెడ్‌షీట్‌పై కూర్చుపెట్టి నేలపై లాక్కొని వెళ్లింది. ఆర్థోపెడిక్ విభాగంలోని వైద్యులు శ్రీకిషన్ ఓజా (65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. అతని కోడలు స్ట్రెచర్ కోసం వెతుకుతూ వెళ్లింది కానీ దొరకలేదు. ఆమె తర్వాత రెండు స్ట్రెచర్లను చూసింది, కానీ వాటికి చక్రాలు లేవు. ఆ తర్వాత ఆమె ఒక బెడ్‌షీట్ తెచ్చి, తన మామగారిని మెయిన్ డోర్ దగ్గరకు లాగి, అక్కడి నుంచి ఆటోరిక్షాను తీసుకుని ట్రామా కేర్ డిపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది. కాగా, శ్రీకిషన్ ఓజా (65) సైకిల్‌పై నుండి పడిపోయాడు. దీంతో ఆయన కాలుకి గాయమైంది. తాము గ్వాలియర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భింద్ జిల్లా నుండి వచ్చామని బాధితుడు చెప్పారు. స్ట్రెచర్లు ఉన్నా చాలా మందికి వర్కింగ్ వీల్స్ లేవని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. 400 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు వాపోతున్నారు.
లక్ అంటే ఇదేనేమో..? పనిచేసింది ఏమీ లేదు.. రూ.కోటిన్నర జీతం..!
ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ముఖ్యంగా టెక్ కంపెనీలు పోటీపడి మరీ ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే రీతిలో ఉంది వ్యవహారం.. పేరు మోసిన టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల్లోనూ ఇదే తీరు ఉంది.. అయితే.. ఓ ఉద్యోగిని మాత్రం.. ఏ మాత్రం పనిచేయకుండానే దాదాపు కోటిన్నర రూపాయాలు జీతంగా అందుకుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.. తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నాను అంటూ.. ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. టెక్ సంస్థల్లో ఉద్యోగం అంటేనే.. జీతం ఎక్కువగా ఉన్నా ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.. కానీ, కోటిన్నర జీతం తీసుకుని.. ఎలాంటి పనిచేయడం లేదంటూ ఓ మహిళ చెప్పడంతో.. టెక్కీలు కుల్లుకునేలా చేస్తోంది. ఇంతకీ, ఎవరా? మహిళ.. ఎందుకు ఆమె ఎలాంటి పనిచేయకుండానే కోటిన్నర జీతం అందుకుంది? అసలు అంత జీతం ఇచ్చి ఆ సంస్థ ఎందుకు ఆమెను ఖాళీగా కూర్చొబెట్టింది అనే వివరాల్లోకి వెళ్తే.. మెటా కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేశారు మాడెలిన్ మచాడో.. 2021లో మెటా కంపెనీలో తన 6 నెలల ఉద్యోగ అనుభవాన్ని టిక్‌టాక్ వీడియోలో వెల్లడించింది ఆమె.. రిక్రూటర్‌గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్ చేయలేదని చెప్పుకొచ్చింది.. అదేంటి అనుకుంటున్నారా? అయితే, ఆ సమయంలో కంపెనీకి ఎలాంటి రిక్రూట్‌మెంట్ ఆలోచనే లేకపోవడమేనట.. మొత్తంగా తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 1.5 కోట్లు జీతం అందుకున్నట్టు వెల్లడించింది.. తన ఉద్యోగ సమయం మొత్తం మెటా కంపెనీలో నేర్చుకోవడంలోనే గడిచిపోయేదన్న మాఎ.. ఆ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి శిక్షణ ఉన్నతస్థాయిలో ఇస్తారని చెప్పుకొచ్చారు.
ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్త
ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి భద్రతను ఉల్లంఘించగా, సకాలంలో పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొప్పల్ మండలానికి చెందిన ఓ యువకుడు చొరబాటుదారుడిగా గుర్తించారు. పోలీసులు అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. బారికేడ్‌ను దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ గుర్తించడంతో అతని వైపుకు పరిగెత్తి అతన్ని అడ్డుకున్నారు. ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండో కూడా అతనిని అనుసరించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తన ర్యాలీలో చెప్పారు. రూ.4,249 కోట్లతో 13.71 కి.మీ వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శనివారం ప్రధాని ప్రారంభించారు. ప్రధాని మోదీ ర్యాలీలో భద్రతా ఉల్లంఘనలు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు హుబ్లీ రోడ్ షోలో ఓ చిన్నారి ప్రధాని దగ్గరికి రావడం జరిగింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ 26వ ఎడిషన్‌ను ప్రారంభించడానికి ప్రధాని మోదీ హుబ్బళ్లి-ధార్వాడ్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే బాలుడిని భద్రతా అధికారులు ఈడ్చుకెళ్లారు.
పంజాబ్ కింగ్స్ లో మార్పు.. జట్టులోకి ఆసీస్ బ్యాటర్
ఐపీఎల్ 2023 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఆస్ట్రేలియాకి చెందిన మాథ్యూ షార్ట్ ని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకుంది. గత ఏడాది గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఏర్పడిన గాయం నుంచి ఇంగ్లండ్ బ్యాటర్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం పంజాబ్ కింగ్స్ (PBKS) జానీ బెయిర్‌స్టో సేవలకు బ్రేక్ ఇచ్చింది. గత ఆగస్టులో దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ బెయిర్‌స్టో పాల్గొనలేదు. గాయం కారణంగా జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2023కి దూరమయ్యాడని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది.”ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాం. అతనికి ఆల్ ది బెస్ట్.. నెక్ట్స్ సీజన్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఐపీఎల్ 2023కి మాథ్యూ షార్ట్‌ని తీసుకున్నాం’’ అని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ పేర్కొంది. గాయపడిన బెయిర్‌స్టో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ షార్ట్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ ఆటగాడిగా నిలిచిన మాథ్యూ షార్ట్ ఈ IPL 2023 కోసం తమతో చేరబోతున్నట్లు వెల్లడించింది.
‘ది ఫ్యామిలీ మాన్ 2’లో ఆ రోల్ చేశాక ‘శాకుంతలం’కి నో చెప్పాను…
సమంతా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి పీక్ స్టేజ్ లో చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సమంతా శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇటివలే తెలుగు ఆడియన్స్ కోసం సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా మాట్లాడుతూ శాకుంతలం సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. “గుణశేఖర్ ముందు నాకు శాకుంతలం సినిమా గురించి చెప్పగానే భయం వేసి నో చెప్పేసాను. ఎందుకంటే అప్పుడు నేను వేరే మూడ్ లో ఉన్నాను. అప్పుడే ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ చేశాను, అందులో యాక్షన్ ఎపిసోడ్స్ తో వేరేలా ఉన్నాను. సడన్ గా శాకుంతలం పాత్ర అంటే భయమేసింది. అయితే ఒకప్పుడు ఏదైనా విషయం నన్ను భయపెడితే దాని స్కిప్ చేసే దాన్ని, ప్రస్తుతం మాత్రం ఏ విషయం భయపెట్టినా ముందు దాన్ని చేసేస్తున్నాను. అదే నన్ను శాకుంతలం సినిమా చేసేలా చేసింది. ఆ తెగింపే నన్ను మూడు సంవత్సరాలుగా ముందుకి నడిపిస్తుంది. శాకుంతలం సినిమాకి ఓకే చెప్పిన తర్వాత గుణశేఖర్ కాస్ట్యూమ్ టెస్ట్ కి పిలిచారు, వెళ్లి గెటప్ లో రెడీ అయితే నాకు నేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సాఫ్ట్ గా కాకుండా రాజీ కోసం ఫిట్ గా మజిల్స్ తో ఉన్నాను. అప్పుడు దుష్యంతుడు నన్ను మర్చిపోయాను అంటే కత్తి తీసుకోని చంపేసే అంత ఫిట్ గా ఉన్నాను. ఆ లుక్ లో ఉంటే శకుంతలగా చెయ్యలేనని అర్ధం అయ్యి నా డైట్ ని మార్చాను, వర్కవుట్స్ ఆపేసాను, సాఫ్ట్ గా కనిపించడానికి పూర్తిగా ఫిట్నెస్ నుంచి దూరం వచ్చాను. అప్పుడు శకుంతల లుక్ వచ్చింది. నడక దగ్గర నుంచి ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్త తీసుకోని శాకుంతలం సినిమా చేశాను. ఇది మనకి ఇండియన్ డిస్నీ క్యారెక్టర్ లాంటి ఫాంటసీ పాత్ర, అందుకే అంత ఇష్టంగా చేశాను. షూటింగ్ సమయంలో పడిన కష్టం ఇప్పుడు చూసుకుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కోసం పతి ఒక్కరూ 100% ఎఫోర్ట్స్ పెట్టారు. అది మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది” అని సమంతా చెప్పుకొచ్చింది.