ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే ఉద్దేశ్యంతోనే బెజవాడలో మూడు ఫ్లైఓవర్లు కట్టామని గుర్తుచేశారు. అమరావతే రాజధాని కాబట్టే.. ఇక్కడ అభివృద్దికి నిధులు కేటాయిస్తాం అన్నారు. అమరావతే రాజధాని.. ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని గతంలో వైఎస్ జగన్ చెప్పారని గుర్తుచేశారు సోము వీర్రాజు.. అయితే, ఇప్పుడు జగన్ అమరావతిని వదిలి విశాఖకు పారిపోతున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు.. విశాఖను వైఎస్ జగన్ అభివృద్ధి చేసేదేంటీ..? అని నిలదీశారు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కోట్లతో అభివృద్ధి జరుగుతోంది.. జగన్ విశాఖ అభివృృద్ధి కోసం రూ. 200 కోట్లు కూడా కేటాయించ లేదని మండిపడ్డారు.. మాకు దమ్మున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. మిగిలిన పార్టీల్లో ఉన్నట్టు.. డబ్బున్న వాడో.. హత్యలు చేసేవారో మాకు నాయకుడిగా లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
జనసేన-బీజేపీ పొత్తు… సోము వీర్రాజు హాట్ కామెంట్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు చర్చగా మారిపోయాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం అందలేదు అనేది బీజేపీ ఆరోపణ.. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదంటూ సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోండి అంటూ మీడియాకు వదిలేశారు సోము వీర్రాజు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ బాగా పని చేస్తారు.. ఏపీలో బీజేపీ మాత్రం ఎదగకూడదని అందరూ మాట్లాడుతున్నారని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.. ఇక, ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావన్న ఆయన.. బీజేపీ-జనసేన విడిపోవాలనేది మీ కోరిక మాత్రమే అన్నారు. ఓ చిన్న మాట పట్టుకుని ఏదేదో ఊహించేస్తున్నారు.. మీ కోరిక ఫలించదన్నారు. మరోవైపు.. వైసీపీ-బీజేపీ కలిసి ఉన్నాయనేది ఓ అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు వీర్రాజు.. నేను ప్రతి రోజూ వైసీపీని, సీఎం జగన్‌ను విమర్శిస్తూనే ఉన్నానని గుర్తుచేశారు. మాధవ్ వ్యాఖ్యలపై ఇంతకు మించి స్పందించనన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తాం.. క్షేత్ర స్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో విశాఖలో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని తెలిపారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.
రేపు సభలో ఏడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు గురువారం రోజు ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు స్పీకర్.. ఇక, డిమాండ్స్ కి గ్రాంట్స్ పై ఓటింగ్ జరగనుంది.. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసెఎస్ డెలివరీ గ్యారెంటీ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ చట్టాల్లో రెండు సవరణ బిల్లులు, ఏపీ ఎస్టీ కమిషన్ సవరణ బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రులు.. ఇక, పోలవరం ప్రాజెక్టు పై బడ్జెట్ సమావేశాల్లో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. కాగా, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిననాటి నుంచి ప్రతీరోజు సభలో రచ్చ జరుగుతూనే ఉంది.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. వారిని సస్పెండ్ చేయడం నిత్యకృత్యంగా మారింది.. ఇక, చివరకు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ఘర్షణ దిగిడం హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు ఏడవ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభిస్తారు.. అంగన్వాడీల సమస్యల పై కాలింగ్ అటెన్షన్ ఇచ్చారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం.. ఇక, వార్షిక బడ్జెట్ పై సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.. మరోవైపు రేపు మండలి ముందుకు పది బిల్లులు రాబోతున్నాయి.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ.. ఏం జరుగుతుందో..?
ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.. గురువారం రోజు దీనికి సంబంధించిన పోలింగ్ నిర్వహించడంతో పాటు సాయంత్రం ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేసింది.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా..? అని జిల్లాల్లో ఆరా తీసింది.. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిలక బరిలో టీడీపీ అభ్యర్థిని నిలపడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది.. ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. బరిలో 8 మంది అభ్యర్థులు ఉన్నారు.. బరిలో ఉన్నవారిలో వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు.. ఈ ఎన్నికల్లో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల కమిషన్ యంత్రాంగం.. పోలింగ్ నేపథ్యంలో రేపు అసెంబ్లీ లోకి విజిటర్స్ కు అనుమతులు రద్దు చేశారు.. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు అధికార, ప్రతిపక్ష పార్టీలు.. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3కి 3 స్థానాలు అధికార పార్టీ చేజార్చుకున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారిపోయాయి.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి.. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది సభ్యులను అప్పగించింది వైసీపీ.. అప్పగించిన సభ్యులు ఓటు వేసే బాధ్యత మంత్రులదే అని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మాక్ పోల్ కూడా నిర్వహించారు.. మొత్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి..
హిందుత్వపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. జైలుపాలయ్యాడు
చేతన్ అహింసాగా పాపులారిటీ పొందిన ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్ తాజాగా కటకటాలపాలయ్యాడు. హిందుత్వపై అతడు చేసిన వివాదాస్పద ట్వీట్లే అందుకు కారణం. స్వయాన హిందువైన అతడు.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్లు చేశాడు. రాముడు, టిప్పు సుల్తాన్, బాబ్రీ మసీదులపై మనకు చెప్పిన మాటలన్నీ అబద్ధమంటూ.. హిందూ మతాన్ని, హిందువుల మత విశ్వాసాల్ని దెబ్బతీసే అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో.. పలు హిందూ సంఘాలు అతనిపై తీవ్రస్థాయిలో మండపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు చేతన్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. ‘‘హిందుత్వం అబద్ధాలపై నిర్మించబడింది. సావర్కర్: రావణుడ్ని రాముడు ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చాక భారతదేశ జాతి ప్రారంభమైందనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది కూడా ఒక అబద్ధమే. హిందుత్వను సత్యం ద్వారా ఓడించవచ్చు – సత్యమే సమానత్వం’’. ఈ విధంగా చేతన్ చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడం, హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, అతడ్ని అరెస్ట్ చేశారు. హిందూ సంఘాలు అతనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కులాలు, మతాల మధ్య శతృత్వం రగిల్చేలా చేతన్ ట్వీట్ ఉందంటూ అతనిపై విరుచుకుపడ్డారు. చేతన్ కుమార్ చేసిన ట్వీట్‌పై హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో చేతన్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
కరోనా కథ ఇంకా ముగియలేదు, అప్రమత్తంగా ఉండాలి.. ప్రధాని కీలక సూచనలు
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను పాటించాలన్నారు. కరోనా కథ ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందని అధికారులకు ప్రధాని గుర్తు చేశారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం-ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వైద్యులకు, ప్రజలకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు మోదీ తెలిపారు. ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. కుల్దీప్ యాదవ్‌పై సీరియస్
చెన్నైలోని భారత్- ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. భారత్ బౌలింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ DRS కాల్ తీసుకున్న తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వద్ద తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా.. 39వ ఓవర్ చివరి బంతికి ఆష్టన్ అగర్‌పై ఎల్‌బిడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడంతో డిఆర్‌ఎస్ కాల్ తీసుకోవాలని కుల్దీప్ రోహిత్‌ను ఒప్పించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. చిరునవ్వుతో రోహిత్ డీఆర్‌ఎస్ తీసుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల కుల్దీప్‌పై విరుచుకుపడటంతో ఒక్కసారిగా భావోద్వేగాల్లో మార్పు వచ్చింది. అతను పరిహాసానికి పాల్పడ్డాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలో కుల్దీప్ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. అయితే రోహిత్ మాత్రం రివ్యూ తీసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ కుల్దీప్ మాత్రం రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆఖరి సెకన్లలో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. అది రివ్యూలో కూడా నాటౌట్‌గా తేలింది. ఈ క్రమంలో క్రమంలో కుల్దీప్‌పై రోహిత్ కాస్త సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నయన్ షాకింగ్ నిర్ణయం.. అందుకే అంత డిమాండ్
గ్లామర్ ప్రపంచమైన సినీ పరిశ్రమలో.. కథానాయికలు ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా, అందాలు ఆరబోయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒకరిద్దరు మాత్రమే గ్లామర్ విషయంలో కండీషన్స్ పెడతారే తప్ప, మిగతావాళ్లు దేనికైనా రెడీ అంటారు. ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందిన భామలందరూ.. కెరీర్ ప్రారంభంలో అందాలు ఆరబోసిన వాళ్లే! అంతెందుకు.. లేడీ సూపర్‌స్టార్‌గా చెలామణి అవుతున్న నయనతార సైతం ఒకప్పుడు గ్లామర్ పాత్రలు బాగానే పోషించింది. బికినీ సైతం ధరించింది. అయితే.. గత కొంతకాలం నుంచి రొమాంటిక్ సీన్లకు, గ్లామర్ పాత్రలకు నయనతార దూరంగానే ఉంటోంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తోంది. కానీ.. ఇప్పుడు ఓ సినిమా కోసం గ్లామర్ షోకి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా? బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కి జోడీ కట్టిన జవాన్ చిత్రంలో! ఇందులో.. ముఖ్యంగా ప్రథమార్థంలో నయనతార ప్రేక్షకుల్ని స్టన్ చేసేలా కనిపించబోతోందని, బికినీ కూడా వేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం, దర్శకుడు అట్లీ కూడా రిక్వెస్ట్ చేయడంతో.. గ్లామర్ షోకి నయనతార ఒప్పుకుందని తెలుస్తోంది.