నాగబాబుకు ఏ శాఖ ఇద్దాం..? సీఎం, డిప్యూటీ సీఎం కీలక చర్చలు..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొణిదెల నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో అడుగు పెట్టడం ఖాయం అయ్యింది.. ఇప్పటికే నాగబాబుకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఆయనకు ఏ శాఖ ఇవ్వాలి అనేదానిపై కీలక చర్చలు సాగుతున్నాయి.. ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
పోలవరం ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్ విడుదల..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి అధికారులు ఇచ్చిన యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు.. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ -1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ -2తో పాటు మిగతాపనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. జులై నాటికే వాటిని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. 2026 జూలై నాటికి పూర్తయ్యేలా చూస్తామన్నారు.. పోలవరం కుడి కాలువ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రం వాల్ 2025 జనవరి నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని అంచనాతో ఉన్నప్పటికీ 2025 డిసెంబర్ నెలకే వాటిని పూర్తిచేయాలని ఆదేశించారు.. 2026 ఆగస్టు నాటికి ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ కొంత మేర పూర్తవుతుంది కాబట్టి.. కాపర్ డ్యాం వద్ద నీరు నిలువ చేసి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు..
పిల్లను ఇచ్చి పెళ్లి చేశారు.. ఊరికే కన్నం వేసిన దొంగ అల్లుడు..!
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో గుర్రపుశాల గ్రామస్తులు పనులకోసం వలసవెళ్లారు. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఓ కుటుంబం అల్లుడు అయిన ముండ్ల రామయ్య.. తమ దగ్గరే పెట్టుకున్నారు. ముండ్ల రామయ్య క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. గ్రామస్తులు పనులకోసం వలసలకు వెళ్లడం గమనించి రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో 6 లక్షల 74 వేల రూపాయలు దొంగ తనం చేశారు.. అంతేకాదు.. తనకు ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలెట్టాడు. గ్రామంలో కొన్ని ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై చౌడయ్య గుర్రపుశాల గ్రామం పోయి అక్కడ దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ దొంగతనంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు గ్రామ అల్లుడే దొంగగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ లో వలపన్ని పట్టుకొని యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి ముండ్ల రామయ్యను కోర్టులో హాజరు పరిచి రికవరీ చేసిన 6 లక్షల 74వేల రూపాయల నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని సీఐ ప్రభాకర్ రావు మీడియాకు టెలిపారు. ఊరి అల్లుడే దొంగ అని తెలియడంతో గ్రామస్తులు అంతా అవాక్కయ్యారు.
ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్మాణాలకు అనుమతి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.. అమరావతి రాజధాని నిర్మాణాలపై చర్చించి.. పలు కీలక నిర్మాణాలకు ఆమోదం తెలిపింది రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)సమావేశం.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. సీఆర్డీఏ సమావేశంలో ఆమోద ముద్రపడిన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.. అమరావతిలో లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్‌లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు.. అసెంబ్లీ బిల్డింగ్ 11.22 లక్షల చదరపు అడుగులు, 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతందన్న ఆయన.. ఐదు టవర్లు… జీఏడీ టవర్ కు 47 ఫ్లోర్లు ఉంటాయి.. 17,03,433 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం ఉంటుందన్నారు.. టవర్ 1 నుంచి 4 వరకు 68,88,064 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం జరుగుతందన్నారు.. ఈ టవర్లకు 4685 కోట్లు ఖర్చు అవుతుంది.. రోడ్ల నిర్మాణానికి అన్ని హంగులతో 579.5 కిలోమీట్లర్లు చేపట్టనున్నాం.. దీనికి రూ.9,695 కోట్ల ఖర్చు చేయనున్నాం అన్నారు. ఇక, ట్రంకు రోడ్లు 151.9 కిలోమీటర్లకు రూ.7,704 కోట్లకు అనుమతిచ్చారు.. STP ప్లాంటుకు రూ.318.15 కోట్లు అనుమతి లభించిందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మార్చి నెల కోటా టికెట్ల విడుదల.. ఏ రోజు ఏవంటే..?
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం వారి అహంకారపురిత మాటలకు నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంగా విమర్శలు చేయడంలో తప్పు లేదన్నారు. కక్ష పూరితంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని.. తప్పులను బయటకు తీసి చర్చలో పెట్టామని మంత్రి పేర్కొ్న్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి. మణిపూర్‌లో వరసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
రేపు ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ
బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. మంగళవారం ‘ఒక దేశం ఒకే ఎన్నికల’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు ఆమోదం పొందాలంటే “129వ రాజ్యాంగ సవరణ బిల్లు”, “1963లో చేసిన “కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు” సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్లులను మొత్తం 32 పార్టీలు సమర్థిస్తుంటే.. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ముస్లిం ఓట్ల కోసమే ప్రియాంక గాంధీ అలా చేశారు!
పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది.. కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాల గురించి ఆమె స్పందించలేదని ఆరోపించింది. ముస్లింల బుజ్జగింపు విధానం కారణంగా కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని విమర్శించింది. ప్రియాంక గాంధీ కూడా బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీజేపీ ఆలోచనను పితృస్వామ్యమని అభివర్ణించిన ఆమె.. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో, నా బ్యాగ్ ఎలా ఉండాలో ఎవరూ నిర్ణయించలేరని అన్నారు. పనికిమాలిన వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ దృష్టి సారించాలని, ప్రజల వేషధారణపై కాదన్నారు. తాము బంగ్లాదేశ్ ఘటనపై స్పందించినట్లు తెలిపారు.
కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి
బాదంపప్పు తినడం అందరికీ అలవాటు ఉంటుంది. బాదం పప్పులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాల్చిన బాదం పప్పు వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? మెదడుకు పదును పెట్టడం నుండి ఎముకలను బలోపేతం చేయడం వరకు.. కాల్చిన బాదం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఏయే వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారో.. ఒక నెల రోజుల పాటు రోజూ ఆహారంలో వేయించిన బాదంపప్పులను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదలలు పొందవచ్చో తెలుసుకుందాం.. కాల్చిన బాదంపప్పులను తినడం వల్ల హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) అంటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.. HDLని కూడా ప్రోత్సహిస్తుంది.
వివో సరికొత్త ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ ప్లే
వివో (Vivo) ‘Y’ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు కంపెనీ ‘Vivo Y300’ అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా కంటే ముందే భారత్‌లో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 3డి పనోరమిక్ ఆడియో కూడా ఉంది. Vivo Y300 ఫోన్ ప్రత్యేకత దాని 6500mAh బ్యాటరీ. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. Vivo Y300 ధర, ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం… ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే 1800 nits పీక్ బ్రైట్‌నెస్, 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ మరియు డైమండ్ షీల్డ్ గ్లాస్‌ని కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పాలంటే మూడు స్పీకర్లు, మ్యాట్రిక్స్ గరిష్ట శక్తి 4.5W, ఇది 600% బిగ్గరగా ఉంటుంది. ఇందులో 3డి పనోరమిక్ ఆడియో కూడా ఉంది. ఈ ఫోన్ లో 50MP బ్యాక్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్.. 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ గ్రీన్ పైన్, స్నో వైట్, స్టార్ డైమండ్ బ్లాక్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత.. SGS ఫైవ్-స్టార్ డ్రాప్, ఫాల్ సర్టిఫికేషన్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
కూలీ సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటూ కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శృతి. కూలీ సెట్స్ లో బైక్ పై ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోతుంది శృతి హాసన్.. రజనీ కాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది శృతి హాసన్ ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా షూటింగ్ తాజగా చెన్నై లో తిరిగి స్టార్ట్ చేసాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. శృతిహాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో బిగ్ ట్విస్ట్
పుష్ప -2 ప్రీమియర్ రోజు జరిగిన సంఘంటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, అదే సమయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మీకతో పాటు చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతి కోరారు సంధ్య థియేటర్ యాజమాన్యం.ఇంతవరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్, రష్మీక మందన్న ప్రీమియర్ షోకు రావడం వలన ఫ్యాన్స్ తో పాటు క్రౌడ్ విపరీతంగా వస్తారని, పుష్ప -2 యూనిట్ ను రావొద్దని సూచించండని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా సమాచారం ఇచ్చారట చిక్కడపల్లి పోలీసులు. అందుకు సంభందించిన లెటర్ ను తాజగా నెట్టింట వైరల్ అవుతోంది . కానీ పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ సంధ్య థియేటర్ కు వచ్చి, అనుమతి లేకుండా భారీ ర్యాలీ చేపట్టాడు హీరో అల్లు అర్జున్. దీంతో అభిమానులు బన్నీని చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో నుండి వెళ్తూ కూడా అల్లు అర్జున్ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపారు పీపీ. హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చారు అల్లు అర్జున్. పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే ఈ లెటర్ ఎంత వరకు వాస్తవమనేది బన్నీ ఫ్యాన్స్ వాదన.