అర్ధరాత్రి గాంధీభవన్‌లో ఉద్రిక్తత..
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్ జంప్ , షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వల్ల మాకు అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గాంధీ భవన్‌ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు.. గాంధీ భవన్‌కు తాళాలు వేశారు..
పోలవరంపై నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది.. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలసిందే కాగా.. సీడబ్ల్యూసీ దీనిపై సమాధానం ఇచ్చింది.. ఇక, ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ కోరింది. వచ్చే నెల 15వ తేదీన పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..
జెఎన్‌యూలో మోదీ డాక్యుమెంటరీ రగడ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐల మధ్య ఉద్రిక్తత
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది. అయితే ప్రదర్శన సమయంలో యూనివర్సిటీ వర్గాలు కరెంట్ తీసేయడంతో విద్యార్థుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో డాక్యుమెంటరీ చూసేందుకు సిద్ధం అయ్యారు. ఈ డాక్యుమెంటరీ చూస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. అయితే తమపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాళ్ల దాడికి పాల్పడిందంటూ ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది. దీనిపై వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాళ్లదాడిలో 25 మంది పాల్గొన్నట్లు లెఫ్ట్ విద్యార్థి సంఘం ఆరోపించింది. అర్థరాత్రి సమయంలో పోలీసులు క్యాంపస్ కు చేరుకున్నారు.
అధికారంలోకి రాగానే విధానసౌధ గోమూత్రంతో శుభ్రం చేస్తా.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా..మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి దెబ్బతిందని ఆన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర సచివాలయాన్ని మలినం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే విధాన సౌధను ఆవుమూత్రంతో శుభ్రం చేస్తానని వెల్లడించారు. మరో 40-45 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధంగా ఉండాలని.. మీ టెంట్లన్ని సర్దుకోండి అంటూ శివకుమార్ అన్నారు. డెటాల్ తో విధాన సౌధను శుభ్రం చేస్తానని.. గోమూత్రంతో శుభ్రం చేసి వినాయకుడిని ఉంచి పూజిస్తామని అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
బాలాకోట్ దాడుల తర్వాత భారత్ పై అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్..
బాలాకోట్ దాడుల అనంతర పాకిస్తాన్, భారత్ పై అణుదాడికి సిద్ధం అయిందని వెల్లడించారు అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా నాలో చెప్పారని.. ఆ సమయంలో నేను వియత్నాంలోని హనోయ్ లో ఉన్నానని.. అణుదాడికి ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం అవుతుందనే మాటతోనే నేను నిద్ర లేచానని వెల్లడించారు. తాజాగా ఆయన రచించిన ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’’ పుస్తకంలో వెల్లడించారు. 2019 ఫిబ్రవి 27-28 తేదీల్లో యూఎస్-నార్త్ కొరియా సమ్మిట్ కోసం హనోయ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు గుర్తు చేసుకున్నారు. భారత్-పాక్ అణు యుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చాయనే విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియదని.. పరిస్థితిని చక్కదిద్దడానికి సుష్మా స్వరాజ్ ను నాకు ఒక నిమిషం సమయం ఇవ్వాలని అడిగానని.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడనని, అయితే తాము ఎలాంటి అణుయుద్ధానికి దిగడం లేదని, భారత్ మాపై అణు దాడి చేయాలని అనుకుంటోందని ఆరోపించారని.. అయితే భారత్ అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదని చెప్పానని అన్నారు. ఆ రోజు మేం చేసిన పనిని మరే దేశం చేసి ఉందడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లోని మా బృందాలు అద్భుతంగా పనిచేశాయని ఆయన అన్నారు.
ఆల్కాహాల్ పాలసీని సవరించిన ఎయిర్ ఇండియా..
ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనతో అబాసుపాలైన ఎయిర్ ఇండియా తన ఆల్కాహాల్ పాలసీని సమరించుకుంది. క్యాబిన్ సిబ్బంది అవసరమైతే ఆల్కాహాల్ అందించేందుకు నిరాకరించాలని తెలిపింది. జనవరి 19న తీసుకువచ్చిన కొత్త పాలసీలో భాగంగా.. క్యాబిన్ సిబ్బంది అందిస్తే తప్పా.. ప్రయాణికులు మద్యం తాగడానికి అనుమతించ కూడదని.. ప్రయాణికులు తమ సొంత ఆల్కాహాల్ సేవించే వారిపై శ్రద్ధ వహించాలని సూచించింది. ప్రయాణికులు ఎవరైనా మరింత మద్యాన్ని డిమాండ్ చేస్తే సున్నితంగా తిరస్కరించాలని సూచించింది. మద్యం ఎక్కువైన సమయంలో ఇక మద్యం ఇవ్వం అని చెప్పొచ్చని.. వారిని తాగుబోతు అని పిలవకూడదని తెలిపింది. ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలని, ప్రయాణికులతో క్యాబిన్ సిబ్బంది తమ స్వరాన్ని పెంచి మాట్లాడవద్దని తెలిపింది. ఆనందం కోసం మద్యం తాగడం, మత్తు కోసం మద్యం తాగడం మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించింది. ఇటీవల రెండు సంఘటనల్లో మద్యం కారణంగా ఎయిర్ ఇండియా ఆరోపణలు ఎదుర్కొంది. న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన జరిగింది. దీని తర్వాత పారిస్-న్యూ ఢిల్లీ విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో విమానంలో మద్యం అందించే విధానాన్ని ఎయిరిండియా సవరించుకుంది.
యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్..
తన యూజర్లకు టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బిగ్ షాక్ ఇచ్చింది.. తన అన్‌లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరపై ఏకంగా 56 రూపాయలు వడ్డించింది.. ఎయిర్‌టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.99 నుంచి రూ.155కి పెంచింది.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.99 ప్యాక్‌పై 24 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లాంటివి అందించేది.. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్ మాయమైంది.. ఇక, 28 రోజుల వ్యాలిడిటీతో అప్‌గ్రేడ్ చేసిన రూ.155 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ప్యాక్ ఉంటుంది మరియు 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది 1 జీబీ ఇంటర్నెట్ డేటా, 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను కూడా కలిగి ఉంటుంది. దీంతో.. ఇప్పుడు, ఎంట్రీ-లెవల్ ఫోన్ ప్లాన్ రూ.155కి సవరించబడింది.. ఇది మునుపటి బేస్ ప్లేస్ కంటే రూ.56 ఎక్కువ. ఎయిర్‌టెల్ నవంబర్ 2022 నుండి ప్లాన్‌ను రద్దు చేయడం ప్రారంభించింది. అంతకుముందు, టెలికాం మేజర్ ఒడిశా మరియు హర్యానాలో ప్లాన్‌ను నిలిపివేసింది. రూ.99-ప్యాక్ సబ్‌స్క్రైబర్‌లకు పరిమిత టాక్-టైమ్‌ను అందించింది, ఇది వినియోగదారు కాల్‌లు చేసినప్పుడు మరియు బ్యాలెన్స్ నుండి తీసివేయబడుతుంది. రూ. 155 అప్‌గ్రేడ్ చేసిన ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ప్యాక్ ఉంటుంది మరియు 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది 1 జీబీ ఇంటర్నెట్ డేటా మరియు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను కూడా కలిగి ఉంటుంది. ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది..
ఈ సినిమాకి 10 ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి…
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీ పది కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. డానియెల్ క్వాన్, డానియెల్ షీనర్ట్ లు దర్శకత్వం వహించిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీలో ‘మిచ్చేల్ యోవ్’ మెయిన్ లీడ్ ప్లే చేశారు. మార్చ్ 25న అమెరికాలో రిలీజ్ అయిన ఈ మూవీ 25 మిలియన్ డాలర్స్ బడ్జట్ తో తెరకెక్కి 104 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. గోల్డెన్ గ్లోబ్ నుంచి క్రిటిక్స్ సర్కిల్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇలా పోటీ చేసిన ప్రతి చోటా “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా అవార్డులు గెలిచింది. మార్చ్ 12న కూడా “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీ లీస్ట్ కేస్ లో ఆరు ఆస్కార్స్ గెలుస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఒక తల్లి-కూతురి కథతో తెరకెక్కిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా ఈ ఏడాది ఇంటర్నేషనల్ సినిమాని ఏలుతుంది. ఒకవేళ ఈ మూవీ చూడాలి అనుకుంటే “లయన్స్ గేట్ ఒటీటీ”లో ఉంది చూసి ఎంజాయ్ చెయ్యండి.
ట్విట్టర్ రివ్యూ… షారుఖ్ హిట్ కొట్టినట్లేనా?
2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ పూర్తి స్థాయిలో సినిమా చెయ్యలేదు. ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేశాడు కానీ షారుఖ్ సోలో సినిమా మాత్రం చెయ్యలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ కూడా కష్టాల్లోకి వెళ్లిపోవడంతో, షారుఖ్ లాంటి స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చే వరకూ బాలీవుడ్ కష్టాలు తీరవు అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. ఎట్టకేలకు దాదాపు అయిదేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈరోజు రిలీజ్ అయిన పఠాన్ సినిమాపై బాలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే 5.6 లక్షల ప్రీబుకింగ్స్ వచ్చాయి. నాన్-హాలీడే రోజు ఉన్న అన్ని రికార్డ్స్ ని పఠాన్ సినిమా బ్రేక్ చెయ్యనుంది. 7700 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన పఠాన్ మూవీ మార్నింగ్ షోస్ అన్ని సెంటర్స్ లో పడ్డాయి. కొన్ని చోట్ల ప్రీమియర్స్ రూపంలో పఠాన్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీని చూసిన కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. షారుఖ్ కంబ్యాక్ ఇచ్చాడు, పఠాన్ మూవీ సూపర్ ఉంది, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి, ట్రైలర్ లో సాంపిల్ మాత్రమే చూపించారు సినిమా ఇంకో రేంజులో ఉంది, షారుఖ్ కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు, బాలీవుడ్ కష్టాలకి పఠాన్ సినిమా ఎండ్ కార్డ్ వేసింది, షారుఖ్ హిట్ కొట్టేసాడు… ఇలా ఎవరి రివ్యూస్ ని వాళ్లు ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో పోర్ అవుతున్న పోస్టుల్లో ఎక్కువ శాతం పాజిటివ్ గానే ఉండడంతో పఠాన్ మూవీ హిట్ కొట్టినట్లేనని బీటౌన్ వర్గాలు ఫీల్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఒపీనియన్స్ కూడా బయటకి వస్తే కానీ పఠాన్ మూవీ హిట్ అయ్యిందా లేదా అని కన్ఫామ్ చేసి చెప్పగలం. ఇప్పటికైతే సినిమా చూసిన వాళ్లు పఠాన్ మూవీ హిట్ అనేస్తున్నారు.