తిరుమలలో డ్రోన్ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..!
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాలను చిత్రీకరించిన సదరు వ్యక్తిపై ఫోకస్ పెట్టింది.. ఇన్ స్టాలో విజువల్స్ పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం.. అయితే, హైదరాబాద్ కి చెందిన వ్యక్తి తిరుమల డ్రోన్ విజువల్స్.. తన ఇన్‌స్టాలో పోస్టు చేసినట్టు గుర్తించారు పోలీసులు.. మరో వైపు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లోని విజువల్స్ ని సదరు వ్యక్తి తొలగించారు.. అయితే, సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఆ విజువల్స్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపేందుకు టీటీడీ అధికారులు సిద్ధం అవుతున్నారు..శుక్రవారం నాడు డ్రోన్‌తో వేంకటేశ్వరుని ఆలయాన్ని వీడియోగ్రాఫింగ్ చేసే అవకాశాలను ఖండించారు మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్‌వో నరసింహ కిషోర్.. ప్రధాన ఆలయం మరియు చుట్టుపక్కల భద్రతను పెంచారు మరియు దానిని డ్రోన్ కెమెరాతో బంధించడం అత్యంత అసాధ్యం అని తెలిపారు.. వైరల్ వీడియోను తదుపరి ధృవీకరణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపుతామని, తప్పు చేసిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యాయవ్యవస్థలో నకిలీలు..
న్యాయవ్యవస్థలోనూ నకిలీలు చొరబడ్డారు.. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణి అవుతున్నారు.. ఇప్పుడు ఈ వ్యవహారం పల్నాడులో కలకలం రేపుతోంది.. విద్యార్హతలు లేకపోయినా.. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణీ అవుతున్నారు. చట్టం, ధర్మం, న్యాయాలను పరిహసిస్తున్నారు. చట్టంపై ఏ మాత్రం అవగాహన లేని వీరు కక్షిదారులను మోసం చేస్తున్నారు. న్యాయవాదుల వద్ద కొందరు గుమాస్తాలుగా చేరి.. కోర్టుల్లో కేసులకు సంబంధించిన విధివిధానాలపై అవగాహన పెంచుకుని.. ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా మారి కోర్టులనే మోసం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. సత్తెనపల్లికి చెందిన బిక్కి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు సహా ఏడుగురిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా కొనసాగుతున్నారని ఆరోపణలతో ఈ ఫిర్యాదు అందించింది.. నకిలీ న్యాయవాదుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత.. వీరిపై ఐపీసీ 120 బీ 420, 467, 468, 471 రెడ్ విత్ 34 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు తుళ్లూరు పోలీసులు. ఇటీవల ఓ కోర్టులో నకిలీ న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా మేజిస్ట్రేట్‌కు అనుమానం వచ్చింది. విద్యార్హత, న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన వివరాలు అడగడంతో అతడి గుట్టు రట్టు అయినట్టు తెలుస్తోంది.. నకిలీలపై ఫిర్యాదులు అధికం కావడంతో స్పందించిన బార్ కౌన్సిల్.. సంబంధిత న్యాయవాదుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. వారు చూపిస్తున్న సర్టిఫికెట్లకు సంబంధిచిన కాలేజీలు, యూనివర్సిటీలకు లేఖలు రాసింది. వాటి నుంచి వచ్చిన సమాచారంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా నిర్ధారించుకుంది. మొత్తం 15 మంది నకిలీ న్యాయవాదులను గుర్తించింది. దీంతో వీరిలో 8 మంది తమ ఎన్‌రోల్‌మెంట్‌ను సరెండర్ చేశారు. మిగతా ఏడుగురిపై బార్ కౌన్సిల్ సెక్రటరీ బి. పద్మలత ఇటీవల తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నెల 11వ తేదీన వారిపై రెండు కేసులు నమోదు చేశారు. మొత్తంగా.. న్యాయవ్యవస్థలో నకిలీలు చొరబడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఏ ఏ కోర్టుల్లో ఎంతమంది నకిలీలు ఉన్నారు.. నల్లకోటు మాటున ఉన్నది.. అసలు న్యాయవాదులా? నకిలీ న్యాయవాదులా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆమె కన్నుమూసింది.. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది..
ఆమె చనిపోయింది.. కానీ అమె హృదయం శ్వాసిస్తూనే ఉంది. అమె చనిపోయింది. కానీ అమె మూత్రపిండాలు రక్తాన్ని శుధ్ది చేస్తూనే ఉన్నాయి. అమె కళ్ళు ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి..అమె చనిపోయినా ముగ్గురి జీవితాల్లో బ్రతికే ఉన్నారు. కళ్లు తెరిస్తే జననం. కళ్లుమూస్తే మరణం. ఆ రెండింటి మధ్య ఉన్న సమయమే జీవితం. ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు. ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. తాము చనిపోతూ అనేకమంది జీవితాల్లో బతికే ఉంటున్నారు. కొందరు అలా ముగ్గురికి పునర్జన్మ అందించారు విశాఖపట్నంకు చెందిన సన్యాసమ్మ.. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి ఆమె గుండెను అమర్చేందుకు విశాఖ నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 25 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లో చేరుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్న సన్యాసమ్మ గుండెను 11.52 గంటలకు తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్ గుండె ఆస్పత్రికి చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు ఆ గుండెను బాలుడికి అమర్చారు. దీంతో, అవయవదానానికి అంగీకరించిన వారికి, శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులకు, ట్రాఫిక్‌ను నియంత్రించి సహకరించిన పోలీసులకు బాలుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సన్యాసమ్మ తాను చనిపోతూ గుండె దానం ద్వారా బాలుడి ప్రాణం నిలిపింది. సన్యాసమ్మ కిడ్నీలను చెన్నైకు, కళ్లను విశాఖలోనే మరొకరి కోసం తరలించారు. సన్యాసమ్మ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం… విధిని సైతం వెక్కరించింది. భౌతికంగా అమె చనిపోయినా.. అమె హృదయ స్పందనలు మాత్రం ఆ బాలుడులో ఎప్పటికీ బ్రతికే ఉండాలని భావించి.. అమె కళ్ళు, గుండె, కిడ్నీలను దానం చేశారు. సన్యాసమ్మ దేహం చితిలో కాలిపోయినా. ఆమె హృదయం శ్వాసిస్తూనే ఉంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్దిచేస్తూనే ఉన్నాయి.కళ్ళు ప్రపంచాన్ని చూస్తునే ఉన్నాయాని జోహార్ సన్యాసమ్మ. జోహార్ అంటూ ఆమెకు, వారి కుటుంబ సభ్యలైన సన్యాసమ్మ భర్త ఆనందరావు, కుమారులు చైతన్య, జయప్రకాన్లను పలువురు అభినందించారు. 2021 అక్టోబర్ 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇప్పటి వరకు వెయ్యి మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించింది. ఈ క్రమంలోనే ఇక్కడి వైద్యులు శుక్రవారం మరో అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు సన్యాసమ్మ తమ ఎదుట లేకపోయినా అవయవదానం రూపంలో ఆమె బ్రతికే ఉంటుందని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్.. రైల్లో వున్న వ్యక్తే..
బాంబు బెదిరింపు కాల్ హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందన్న ఫేక్ ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే పోలీసులు సికింద్రాబాద్ చేరుకోనున్న కృష్ణ ఎక్స్ప్రెస్ మౌలాలిలో ఆపి తనికీలు నిర్వహించారు. అప్పటికే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా పెద్దఎత్తున పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. పదో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. మౌలాలి వద్ద రైల్‌ను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత.. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ఈ బాంబు బెదిరింపు కాల్ వల్ల 2 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాద్ బయలు దేరింది. బాంబ్ లేదని తేలాగా కాల్ చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి రైల్ లోనే ఉన్న కిరణ్ ను అదువులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి
భద్రాద్రి కొత్తగూండె జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లెందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ ఢీకొన్నాయి. బలంగా ఢీకొట్టడంతో..కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు మృతి చెందినట్లు సమాచారం. కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తండగా చనిపోయారు. అయితే స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తుందని తెలిపారు. కారులో వెడ్డింగ్ సూట్‌కి సంబంధించిన వస్తులు ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెడుతున్నట్లు తెలుస్తోంది. కారు టీఎస్03ఎఫ్ సీ 9075 నంబరు గల మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లందు వెడుతోంది. కాగా.. ఈ కారును ఏపీ16టీజీ 3859 అనే నంబరు గల ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెడుతున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.. దీంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లారీలో వున్న వ్యక్తి పారారీలో వున్నాడా? లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయంపై ఇంకా నిర్ధారణ రాలేదు. అయితే.. కారులో ప్రయాణించే వ్యక్తులందరూ చనిపోవడం లారీ స్పీడ్ గా నడపడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లారీ డ్రైవర్ తాగి బండినడిపాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? రెండోది, కొత్త లీడర్ తానేనా? అన్నది చూడాలి. అవును. ప్రస్తుతం కొత్త నాయకత్వం అవసరం. నేనే ఆ కొత్త లీడర్ కావొచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. అధ్యక్షుడు బైడెన్‌కు మరో అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు తాను ‘కొత్త నాయకురాలు’ కాగలనని భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ గురువారం చెప్పారు. యునైటెడ్ నేషన్స్‌లోని మాజీ అధ్యక్షుడు జో బిడెన్‌కు అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి పదవి లభించకపోవచ్చని అన్నారు. గురువారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నిక్కీ హేలీ 2024 US అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2018లో ట్రంప్ పరిపాలన నుండి హేలీ వైదొలిగారు. తాను గవర్నర్, అంబాసిడర్‌గా చాలా బాగా పనిచేశానని చెప్పుకొచ్చారు. రెండు అంకెల నిరుద్యోగంతో బాధపడుతున్న రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకొచ్చామని చెప్పారు. తాను ఎన్నడూ ఏ పోటీలో ఓడిపోలేదని.. అధ్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతానన్నారు.
మరోసారి వివాదాల్లో డోలో 650తయారీ కంపెనీ
డోలో 650 ట్యాబెట్లను తయారు చేస్తున్న కంపెనీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. 30ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ఆరోగ్య బీమా చెల్లించలేదని పిటీషనీర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. కంపెనీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ట్రయల్ కోర్టులో నమోదు చేయబడింది. డోలో-650 తయారీదారులు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఉద్యోగులు ఆరోగ్య బీమా స్కామ్ (ఈఎస్‌ఐ స్కామ్)కు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత ట్రయల్ కోర్టులో కేసు నమోదైంది. న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 20న విచారణకు పోస్ట్ చేసిన జస్టిస్ రాజ్‌బీర్ సింగ్ ముందు సమర్పించారు. గతంతో కూడా డోలో 650కంపెనీ జ్వరంతో బాధపడుతున్న రోగులకు టాబ్లెట్‌ను సూచించిన వైద్యులకు కంపెనీ రూ.1,000 కోట్ల విలువైన బహుమతులను అందించిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖ పరిధిలో ఉంది.
తన నెక్ట్స్ మూవీ కోసం కసరత్తు చేస్తున్న బాలయ్య డైరెక్టర్
ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు యువ దర్శకుడు గోపిచంద్ మలినేని. రవితేజతో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్, రీసెంట్ గా వీర సింహా రెడ్డి ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. అయితే.. విన్నర్ సినిమా తప్పితే మిగతా సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమా అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మాసివ్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా… భారీ కలెక్షన్స్‌తో దుమ్ము లేపింది. డైరెక్షన్ పరంగా గోపీచంద్ మలినేని నెక్స్ట్ లెవల్ కి వెళ్లారన్న కామెంట్స్ వచ్చాయి. అయితే.. ఈ యువ దర్శకుడి నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఆయన తన నెక్ట్స్ ఫిలిం గురించి ప్రస్తావిస్తూ.. తన నెక్ట్స్ సినిమా గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. డార్లింగ్‌తోనే కాకుండా.. ఇతర హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. కానీ ప్రస్తుతం ఎవరితోనూ కమిట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రస్తుతం కొంత విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు.. విరామం తరువాత తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనులో ఉంటానన్నారు. తన తరువాత సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.