కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే..
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కొండగట్టుకు చేరుకొంటారని వెల్లడించారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారని వివరించారు. కాగా.. జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారుల, ప్రజాప్రతినిధులతో సీఎం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..
విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలేమో ఎండ మంట.. రాత్రైతే వణుకు..!
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది.. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రికి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే వీధిలో 7.7, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కట్టకిందపల్లి, గంగవరంలో 10 డిగ్రీలుగా ఉంది. ఇక శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీల్లోపు ఉంటున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత పెరుగుతున్న చలి తీవ్రత.. ఉదయం వరకూ కొనసాగుతోంది. అటు తెలంగాణలోనూ.. రాత్రి సమయంలో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 7.1, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లో 7.9, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో 8.9, నిర్మల్ జిల్లా జామ్‌లో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలకు పైగా పెరిగాయి. పగటిపూట 38 డిగ్రీలు నమోదవుతుండటంతో .. ఫిబ్రవరిలోనే ఎండాకాలం తలపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల అధికంగా ఉంది. దీంతో ఏసీల వాడకం మొదలైంది. వారం క్రితంతో పోలిస్తే విద్యుత్తు వినియోగం 8 మిలియన్ యూనిట్ల వరకు పెరిగింది. సోమవారం తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 38, శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా చిలకలమర్రిలో 37.8, ప్రకాశం జిల్లా పునుగోడులో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి.
మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్
మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అలానే తాగి వాహనాలను నడుపుతున్నారు. అయినా ఒకసారి సరే.. రెండు సార్లు సరే.. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. పదే పదే తాగేసి తూలుతూ వాహనాల్లో తిరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా? మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళ పోలీసులు షాక్ ఇచ్చారు. మందుబాబులకు వార్నింగ్ ఇచ్చి, ఫైన్‌లు వేసి విసిగిపోయిన పోలీసులు వినూత్నంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి శిక్ష విధించారు. మందుకొట్టి వాహనాలు నడుపుతున్న వారితో.. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. మందుబాబులంతా చేసేది లేక పోలీస్ స్టేషన్‌లో నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాశారు. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు వెల్లడించారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు.
పుల్వామా సైనికుల త్యాగానికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం నివాళులు
2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు. అమరవీరులను స్మరించుకుంటూ దేశం వారికి నివాళులర్పిస్తోంది. పుల్వామా దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే సారి 40 మంది వీరసైనికులు భరతమతా ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకోవడంతో దేశమంతా ఆవేశంతో ఊగిపోయింది. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. దేశంలో ప్రతి సంవత్సరం ఈ దాడిని ఖండిస్తూ పుల్వామా దాడి ఘటన మన దేశానికి చీకటి రోజంటూ అమరవీరులకు నేడు నివాళులర్పిస్తోంది. పాకిస్తానీ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన అమరజవానుల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని.. వారి సేవలను దేశం స్మరించుకుంటోంది. వారికి దేశప్రజలు ఘననివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటన పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన దాడిని ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాలిపోయిన మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణహోమం జరిగిన ప్రాంతం.. హృదయాన్ని కదిలించే దృశ్యాలు అన్ని వార్తలలో నిలిచాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద 22 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్‌గా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను కాన్వాయ్‌లోకి ఎక్కించాడు. అతను కాశ్మీర్ నివాసి, కుటుంబం ప్రకారం, 2018లో అదృశ్యమయ్యాడు. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఫిబ్రవరి 15, 2019న, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడికి పాకిస్తాన్‌పై ఆరోపణలు చేసింది, అయితే పాకిస్తాన్ అలాంటి ఆరోపణలన్నింటినీ ఖండించింది. భారత ప్రభుత్వం వరుస సమావేశాల తర్వాత, పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ప్రతీకార జ్వాలల్లో ఊగిపోయింది. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.12 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
న్యూజిలాండ్‌లో భీకర తుఫాను.. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం
న్యూజిలాండ్‌పై గ్యాబ్రియెల్ తుఫాను విరుచుకుపడింది. ఈ తుఫాన్ దాటికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర దీవిలో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది. దీంతో మంగళవారం న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం వెల్లడించింది. ఉష్ణమండల తుఫాను నార్త్ ఐలాండ్‌ను తాకడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అత్యవసర నిర్వహణ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ తుఫాన్ నార్త్ ఐలాండ్‌లో చాలావరకు పెద్ద ప్రభావాలను చూపుతోందని మెక్‌అనుల్టీ చెప్పారు. న్యూజిలాండ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి. గతంలో 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు, 2020లో కొవిడ్ మహమ్మారి కారణంగా ఎమర్జెన్సీని విధించారు. తాజాగా గ్యాబ్రియెల్ తుఫాన్ నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో న్యూజిలాండ్ చూడని విధంగా కురుస్తున్న వర్షం దేశవ్యాప్తంగా దారుణమైన ప్రతికూల పరిస్థితులను కల్పించిందని మెక్ అనుల్టీ అన్నారు. భీకర వర్షం కారణం దేశంలో సంబంధాలు తెగిపోయాయని వివరించారు. న్యూజిలాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెస్ట్ ఆక్లాండ్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఒక అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రపంచంపై దాడి చేయనున్న మరో వైరస్.. గినియాలో 9 మంది మృతి
ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది. ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ కారణంగా 9 మంది మృతి చెందారు. వారి శాంపూల్స్ సేకరించి టెస్ట్ చేసిన గినియా హెల్త్ సర్వీస్ అధికారులు అది మార్బర్గ్ వైరస్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కి తరలించి వారిని పరీక్షిస్తోంది. ఇది ఎబోలా వలె ప్రాణాంతకమని గినియా ఆరోగ్యమంత్రి వెల్లడించారు. గినియాలోని ఒక ప్రావిన్స్‌ను నిర్బంధంలో ఉంచినట్లు ప్రకటించారు. ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో అనుమానిత కేసులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయితే ముగ్గురి వ్యక్తుల్లో మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితితో చర్చల అనంతరం ఆ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్ ప్రణాళిక అమలు చేయబడింది. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్, పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య హెచ్చరిక ప్రకటించబడిందని ఆరోగ్య మంత్రి మితోహా ఒండో అయేకాబా విలేకరుల సమావేశంలో చెప్పారు. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో 4,325 మందిని ఈ వైరస్ ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య తొమ్మిది మరణాలు సంభవించాయని, ఫిబ్రవరి 10 న ఆసుపత్రిలో అనుమానాస్పద మరణంపై ఇంకా పరీక్షలు జరగాల్సి ఉందని మంత్రి తెలిపారు.
ఎవరు ఎంత ధర పలికారు..? ఎవరు దక్కించుకున్నారు..?
మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్‌ను.. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్స్ 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2.20 కోట్లకు దక్కించుకుంది. షఫాలీ వర్మను 2 కోట్లకు, మారిజానే కాప్ 1.50 కోట్లకు డీసీ సొంతం చేసుకుంది. రిచా ఘోష్‌ను ఆర్‌సీబీ కోటీ 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌పై ముంబై 1.90 కోట్లు వెచ్చించింది. అలాగే ఎలిస్ పెర్రీ 1.70 కోట్లు, లెఫ్టామ్ పేసర్ రేణుకా సింగ్‌ను 1.50 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. సోఫీ ఎకెల్‌స్టోన్‌పై ఉత్తరప్రదేశ్ వారియర్స్ 1.80 కోట్లు వెచ్చించింది. తెలుగమ్మాయి అంజలీ శర్వాణీని..యూపీ వారియర్స్ జట్టు 55 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో అండర్ -19 ప్లేయర్స్ హవా కొనసాగింది.. వీళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛేజీలు పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డాయి. అండర్ -19 టీమ్ కెప్టెన్, లేడీ సెహ్వగ్‌గా పేరొందిన షఫాలీ వర్మ భారీ ధర పలికింది. ఆమెను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వికట్ కీపర్ రీచా ఘోష్‌ను రూ.1.9 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండర్) రూ.1.80 కోట్లు, యస్తికా భాటియా (వికెట్ కీపర్) రూ.1.50 కోట్లు, రేణుకా సింగ్ (పేసర్) రూ.1.50 కోట్లు, రానా (ఆల్‌రౌండర్) రూ.75 లక్షలు పలికారు. ఇక, అత్యధిక ధర పలికిన టాప్ భారత మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. స్మృతి మంధాన(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రూ.3.40కోట్లు, దీప్తి శర్మ(యుపి వారియర్స్) రూ.2.60కోట్లు, జెమిమా రోడ్రిగ్స్(ఢిల్లీ క్యాపిటల్స్) రూ.2.20కోట్లు, షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్) రూ.2.00కోట్లు, పూజా వస్త్రాకర్(ఢిల్లీ క్యాపిటల్స్) రూ.1.90కోట్లు, హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబయి) రూ.1.80 కోట్లు.. మరోవైపు.. అత్యధిక ధర పలికిన టాప్-5 విదేశీ మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. అస్ల్టీ గార్డినర్(ఆస్ట్రేలియా) గుజరాత్ జెయింట్స్- రూ.3.20కోట్లు, నటాలియా స్కీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ముంబై – రూ.3.20కోట్లు, బెత్ మూనీ(ఆస్ట్రేలియా) గుజరాత్ జెయింట్స్ కు రూ.2.0కోట్లు, సోఫియా ఎక్లేస్టోన్(ఇంగ్లండ్) యూపీ వారియర్స్ – రూ.1.80కోట్లు, ఎలిస్సా పెర్రీ(ఆస్ట్రేలియా) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.1.70కోట్లు పలికారు.
బాసు గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా చిరు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ఈ మూవీకి దేవి ఇచ్చిన సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ అనే చెప్పాలి. బాస్ పార్టీ, పూనకలు లోడింగ్ సాంగ్ అయితే మెగా ఫాన్స్ కి నిజంగానే పూనకలు తెచ్చాయి. దాదాపు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిరు డాన్స్ గ్రేస్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ ఏజ్ లో కూడా అంత ఈజ్ తో డాన్స్ చెయ్యగల హీరో మరొకరు లేరు అనడంలో ఆశ్చర్యం లేదు. శృతి హాసన్ కూడా చిరు పక్కన అందంగా డాన్స్ చేస్తుంది. లిరికల్ సాంగ్ సమయంలో ఈ సాంగ్ బాగానే ఉంది అనిపించింది కానీ సినిమాలో డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఈ పాట బాగా నచ్చుతుంది. ఫారిన్ లోకేషన్స్, చిరు డాన్స్ లో గ్రేస్, శృతి గ్లామర్ అన్నీ పుష్కలంగా ఉన్న ‘నీకేమో అందం ఎక్కువ’ సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది.