తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా..
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ కొత్త సచివాలయాన్ని ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించాల్సి ఉండగా.. పెండింగ్ పనుల కారణంగా సచివాలయం ప్రారంభం ఫిబ్రవరి 17కి వాయిదా పడింది.ఈరోజు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడడం చర్చకు దారితీసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో 13, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 27. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది. అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడటంతో సంచలనంగా మారింది.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. ఇవాళ అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లతో పాటు.. మార్చి మాసానికి సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయించనుంది టీటీడీ.. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. ప్రస్తుతం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.. ఇక, నిన్న శ్రీవారిని 57,702 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.43 కోట్ల ఆదాయం లభించింది.
శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి.. శివరాత్రికి ముందే ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంటాయి.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ప్రతీ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.. శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు.. ఇక, ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు.. బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సేవలు నిర్వహించనున్నారు. 11వ తేదీన ధ్వజారోహణ, 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వైసీపీలో కలకలం.. జనసేన ఫ్లెక్సీల్లో ఆమంచి ఫొటో..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం రేగుతోంది.. ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు బాపట్ల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చగా మారింది.. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజా కలకలానికి కారణమయ్యాయి.. పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన పార్టీ కార్యక్రమాలు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ ఫ్లెక్సీల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఫోటోను ముద్రించారు.. ఇప్పటి వరకు తన సోదరుడితో పాటు వైసీపీలోనే కొనసాగుతున్నారు ఆమంచి స్వాములు.. కానీ, జనసేన ఫ్లెక్సీల్లో స్వాములు ఫొటోతో కొత్త చర్చ మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ వెనుకే ఆమంచి స్వాములు ఫొటోలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. ఇక, నాదెండ్ల మనోహర్, నాగబాబు ఫొటోలను కూడా ఆ ఫ్లెక్సీల్లో పొందుపర్చారు.. అయితే, ఆ ఫ్లెక్సీలతో తమకు సంబంధం లేదంటున్నారు ఆమంచి స్వాములు వర్గీయులు.. ఇదే సమయంలో ఫ్లెక్సీల తొలగింపుపై మాత్రం వారు మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఆమంచి స్వాములు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తారా? పార్టీ మారుతున్నారా? జనసేన పార్టీలో చేరనున్నారా? అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. ఒకవేళ ఆమంచి స్వాములు వైసీపీకి గుడ్‌బై చెబితే.. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ణమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఆయన వైసీపీలోనే కొనసాగుతారా? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా ఓవైపు నెల్లూరు రాజకీయం హీట్ తగ్గక ముందే.. మరో ఘటన ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు తెరలేపింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే, పాకిస్తానే ఉండేది కాదు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతృత్వంలోని ప్రభుత్వం, తమ దేశానికి ఎంతో ప్రమాదకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగి ఉంటే.. అసలు పాకిస్తాన్ ఉనికి ఉండేది కాదని కుండబద్దలు కొట్టారు. ఇమ్రాన్ ప్రభుత్వం వల్లే ఇప్పుడు దేశంలో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. కేబినెట్ మీటింగ్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ని ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ అసభ్యకరమైన పంజాబీ పదాన్ని ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఆధ్వర్యంలోని ఒక మంత్రి.. ఇస్లామాబాద్‌లోని సౌదీ రాయబారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే.. ఆ మంత్రి పేరు మాత్రం రివీల్ చేయలేదు. గతేడాది ఏప్రిల్‌లో పదవీచ్యుతుడైన తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌ను అడ్డుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు బజ్వా బదులిస్తూ.. ‘‘మీరు ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు, మీరు పోటీ పడేందుకు సిరీస్ ఇంకా ఉంది’’ అంటూ చెప్పారన్నారు. పార్లమెంటులో పీటీఐ, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) మధ్య కేవలం రెండు ఓట్ల స్వల్ప తేడా మాత్రమే ఉందని.. బంగ్లాదేశ్‌లోని ఖలీదా జియా ఉదాహరణను ఉటంకిస్తూ, అసెంబ్లీకి రాజీనామా చేయవద్దని తాను ఇమ్రాన్‌కు సలహా ఇచ్చానని బజ్వా తెలిపారు. ఖిలీదా జియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే వారి రాజకీయ పార్టీ భారీ నష్టాల్ని చవిచూసిందని తాను సూచించానని, రాజీనామా నిర్ణయం సరైంది కాదని తాను ఇమ్రాన్‌కు చెప్పానన్నారు. పార్లమెంట్‌లో కొనసాగితే, భవిష్యత్తుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని సూచించానని కూడా ఆయనన్నారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ స్పందించలేదన్నారు.
వాడు కొంచెం పిచ్చోడు, స్మిత్‌పై రోహిత్ వ్యాఖ్యలు.. వీడియో వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో పరుగుకు ప్రయత్నించిన రవీంద్ర జడేజాతో రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. లబుషేన్ వేసిన 76వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో జడేజా స్లిప్‌లోకి బంతిని ఆడి క్విక్ సింగిల్ తీశాడు. బంతిని స్మిత్ నిదానంగా అందుకోవడం చూసిన జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం.. ‘ఓ థోడా పాగల్ హై. సచ్ మే’ (వాడికి కొంచెం పిచ్చి) అంటూ స్మిత్‌ను ఉద్దేశించి.. రెండో రన్ కోసం రావద్దంటూ జడేజాను వారించాడు. బాల్‌ను నిదానంగా తీసుకుంటున్నట్లు నటించి, వేగంగా త్రో వేయడం కోసం స్మిత్ వేసిన ప్లాన్ అని.. ఇలాంటి పిచ్చి వేశాలు అతని దగ్గర చాలా ఉన్నాయనే ఉద్దేశంతో రోహిత్ అలా అన్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ అన్న మాటల స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(120) సెంచరీతో చెలరేగగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరో 50 పరుగుల ఆధిక్యం అందుకుంటే దాదాపు ఈ మ్యాచ్ భారత్ వశమైనట్లే.
తమన్ ట్రెండ్ మార్చి అయిదేళ్లు…
తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని మనం ఎంజాయ్ చేస్తాం అని, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మన అందరం అభిమానులం అని… మణిశర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్ కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా మాస్ సాంగ్స్ నే చేశాడు. డ్రమ్స్ కొట్టాలి అంటే తమన్ తర్వాతే అనే రేంజులో వాయించే వాడు. ఒకానొక సమయంలో తమన్ ఇక డ్రమ్స్ తప్ప వేరేవి వాయించడా? ఇంకా మ్యూజిక్ లో వేరియేషన్స్ చూపించడా అనే కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో తమన్ తనని తాను ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసుకుంటూ ‘తొలిప్రేమ’ సినిమాకి మ్యుజిక్ ఇచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టొరీలో అంత ఫీల్ వర్కౌట్ అయ్యింది అంటే దానికి కారణం తమన్ ఇచ్చిన మ్యూజిక్. తొలిప్రేమ సినిమాలో ప్రతి సాంగ్ ని బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు తమన్. డ్రమ్స్ వాయించే తమన్ లో ఇంత సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. 2018లో రిలీజ్ అయిన తొలిప్రేమ సినిమాలో సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ గా ఉంటుంది. నిన్నిలా నిన్నిలా సాంగ్, తొలిప్రేమ టైటిల్ సాంగ్, హీరో-హీరోయిన్ విడిపోయే సీన్ ఇలా చెప్పుకుంటూ పోతే తొలిప్రేమ ఒక మ్యూజిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. తమన్ అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి అయిదేళ్లు అయ్యింది. 2018 నుంచి తమన్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. ఏ సినిమాకి తమన్ మ్యూజిక్ చేసినా అది ఆ సినిమాకి రాక్ సాలిడ్ గా హెల్ప్ అవుతుంది. 2018లోనే తమన్ ‘భాగమతి’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలకి కూడా మ్యూజిక్ చేశాడు. తమన్ 100వ సినిమా అయిన అరవింద సమేత మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ పీక్స్ చూస్తున్న తమన్, త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ మూవీతో తమన్ పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవుతాడేమో చూడాలి.
ప్రేమికుల రోజు అయిపోగానే బాస్ సినిమా అప్డేట్ వస్తుంది…
ది బాస్ అనే మాట వినగానే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో దర్శన్ గుర్తొస్తాడు. యష్, సుదీప్, ఉపేంద్ర, శివన్న, పునీత్, రిషబ్, రక్షిత్ శెట్టిలాగా తెలుగు సినీ అభిమానులకి దర్శన్ పెద్దగా తెలియదు కానీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తెలుగు వాళ్లకి మాత్రం బాగా తెలుసు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలాగో కన్నడలో దర్శన్ అలాగా… పాన్ ఇండియా ఆడియన్స్ కి వాళ్లు ఎక్కువగా తెలియదేమో కానీ సొంత ఇండస్ట్రీలో వాళ్లని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ ఉండదు. అంతటి స్టార్ హీరో అయిన దర్శన్, 2021లో రెండు సినిమాలు చేశాడు. ఇందులో ‘రాబర్ట్’ అనే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. వంద కోట్లు రాబట్టిన ఈ మూవీ తర్వాత దర్శన్ ఏడాది గ్యాప్ తీసుకోని మళ్ళీ 2023లో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ‘క్రాంతి’ సినిమాతో ఈ రిపబ్లిక్ డేకి ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్ సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. రెండు వారాల్లో క్రాంతి సినిమా 35 కోట్ల షేర్ ని రాబట్టి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2023లో మంచి స్టార్ట్ ఇచ్చింది. క్రాంతి మూవీ కలెక్షన్స్ విషయంలో గ్రాస్ ఎక్కువ చెప్పారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి కానీ దర్శన్ ఫాన్స్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా క్రాంతి సినిమాని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్ లో దర్శన్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చెయ్యబోతున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న దర్శన్ 56 ( #D56 ) సినిమాకి తరుణ్ కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి 16న D56 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఈ మూవీ ప్రీలుక్ ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో కత్తి మాత్రమే ఉండడంతో దర్శన్ మరోసారి పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా చెయ్యబోతున్నాడు అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. దర్శన్ మాస్ సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఆడియన్స్ లో ఉంది.