శ్రీవారిపై కాసుల వర్షం.. వరుసగా 13వ నెల రూ.100 కోట్ల పై మాటే..
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాకి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక కోట్లాది రూపాయలు, బంగారం, వెండి.. ఇలా స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉంటారు.. కరోనా సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం దూరం కాగా.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఇక, గత 13 నెలలుగా.. రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతూ వస్తుంది శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 13వ నెల శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయల మార్క్‌ని దాటినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.. మార్చి మాసంలో స్వామివారికి హుండీ ద్వారా రూ.120.29 కోట్లు ఆదాయం లభించినట్టు పేర్కొంది.. గత ఏడాది మార్చి నుంచి వరుసగా రూ.100 కోట్ల మార్క్ ని స్వామివారి హుండీ ఆదాయం దాటుతోందని తెలిపింది.. గత ఏడాది ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్ల ఆదాయం శ్రీవారికి హుండీ ద్వారా లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హుండీ కానులక ద్వారా టీటీడీకి రూ.1,520.29 కోట్ల ఆదాయం వచ్చింది.. మొత్తంగా మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హుండీ ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం సమకూరింది.
నడిచి వెళ్లే భక్తులకు గమనిక.. నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి దర్శనం కొసం నడిచి వెళ్లే భక్తుకుల శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనుంది. తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం టికెట్లు మంజూరు చేయనున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి కాలిబాట మార్గంలో సుమారు 10,000 దివ్య దర్శనం టోకెన్లు,శ్రీవారి మెట్టు మార్గంలో 5,000 టోకెన్లు జారీ చేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 మధ్య భక్తుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఎస్ఈడీ (ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఒక్కొక్కటి రూ.300) టిక్కెట్ల జారీని తగ్గించాలని, శ్రీవాణి, పర్యాటకం, వర్చువల్ సేవా కోటాలను తగ్గించాలని TTD నిర్ణయించింది. సాధారణ యాత్రికులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే చర్యలో భాగంగా టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి నెలల్లో దర్శనం కోసం రిఫరల్ లెటర్లను తగ్గించాలని, భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడంలో ఆలయ నిర్వహణకు సహకరించాలని టీటీడీ చైర్మన్ వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. అన్ని కల్యాణకట్టలు 24 గంటలూ పనిచేస్తాయని, తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తామని టీటీడీ పేర్కొంది. యాత్రికులకు సంబంధించిన సేవలు సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు అధికారులు, అదనపు శ్రీవారి సేవా వాలంటీర్లను నియమించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న కవిత.. ప్రసంగంపై ఉత్కంఠ
నేడు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగాని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. అక్కడ కవిత ప్రసంగించనున్నారు. దీంతో కవిత పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే కవిత ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. కవిత ఏం మాట్లాడనున్నారు. ఎవరి గురించి నోరువిప్పనున్నారు. ఎవరెవరికి చురకలంటించనున్నారు. ప్రశ్నిస్తారా? తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెబుతారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు ఏవీ? అంటూ ప్రశ్నించారు. ధరలను ఎవరు ఫిక్స్ చేశారు? ఏ కంపెనీలు సప్లై చేశాయి? దానికి డీలర్లు ఎవ్వరూ? అంటూ ప్రశ్నిల వర్షం కురిపించారు. డీలర్లకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకున్న సంబందం ఏమిటి? అని ప్రశ్నించారు భట్టి. లోతుగా విచారణ చేపట్టాలని కోరారు. పేపర్ లీకేజీ పై సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీ వ్యవహారంను ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ వదిలేసి మహారాష్ట్ర కర్ణాటక తిరుగుతున్నారు అంటూ ఎద్దేవ చేశారు. సీఎం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? అంటూ ప్రశ్నించారు. ఒక ఆయన నష్టపరిహారం, ఇంకో ఆయన పరువు నష్టమంటాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ ను అడ్డం పెట్టుకొని ఆసలు వాల్లు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మొహాలీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ లో కేకేఆర్ టీమ్ ప్రదర్శన చాలా కష్టంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కోల్ కతా జట్టు ఏడవ స్థానంలో నిలిచింది. కేకేఆర్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ప్లేఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి జట్టు బ్యాటింగ్ తో ప్రారంభించాలనుకుంటుంది. అయితే ఈసారి కోల్ కతా నైట్ రైడర్స్ కు నితీష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో జట్టకు సారథిగా ఎంపికయ్యాడు. జట్టు బ్యాటింగ్ లో వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ ఉండగా.. బౌలింగ్ లో సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమెష్ యాదవ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ మ్యాచ్ విన్నర్ల విభాగంలోకి వస్తారు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ రెండ్లు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 10 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి పంజాబ్ పై కోల్ కతా జట్టు మెరుగైన రికార్డును నిలబెట్టుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.
ఇటలీలో చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం
ప్రస్తుతం టెక్ వర్గాల్లో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా ఇది విద్యార్థుల చేతుల్లోకి వెళ్లడం వల్ల వారి అభ్యసన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటలీలో డేటా సేకరణపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ తాత్కాలికంగా నిషేధించబడింది. ఇటీవల బెంగళూరులోని ఆర్‌వీ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ ఎడ్యుకేషన్ బోర్డ్ చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ కూడా చాట్‌జీపీటీ సహా కృత్రిమ మేధ ఆధారిత టూల్స్‌ను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు అసైన్‌మెంట్లు సహా ఇతర ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రొఫెసర్లు కూడా బోధనలో వీటిని వాడొద్దని ఆదేశించింది. తాజాగా శుక్రవారం, ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇటాలియన్ వినియోగదారుల డేటాను సేకరించకుండా చాట్‌బాట్‌ను తక్షణమే బ్లాక్ చేస్తామని ప్రకటించింది. అయితే అధికారులు చాట్‌జీపీటీ వెనుక ఉన్న కాలిఫోర్నియా కంపెనీ OpenAIని విచారించారు.
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర.. కొత్త ధరలు ఇలా..!
2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు గ్యాస్ ధరలపై గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది.. అయితే, రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల మాత్రం ఎలాంటి ఉపశమనం లేదు.. కాగా, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలోనే పెంచింది ప్రభుత్వం.. గత నెలలో, కేంద్రం దేశీయ వంట గ్యాస్ ధరలను రూ.50 పెంచిన విషయం విదితమే. ముఖ్యంగా, మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది.. ఇప్పుడు రూ.92 తగ్గించింది. తాజాగా సవరించిన రేట్ల తర్వాత ఇండేన్ గ్యాస్ సిలిండర్ ధరలు (19 కిలోల సిలిండర్): ఢిల్లీలో రూ.2028గా, కోల్‌కతాలో రూ.2132గా, ముంబైలో రూ.1980గా.. చెన్నైలో రూ.2192.50గా ఉంది.. ఇక, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఓసారి పరిశీలిస్తే.. శ్రీనగర్‌లో రూ.1,219, ఢిల్లీలో రూ.1,103, పాట్నాలో రూ.1,202, లేహ్‌లో రూ.1,340, ఐజ్వాల్‌లో రూ.1255, అండమాన్‌లో రూ.1179, అహ్మదాబాద్‌లో రూ.1110, భోపాల్‌లో రూ.1118.5, జైపూర్‌లో రూ. 1116.5, బెంగళూరులో రూ. 1115.5, ముంబైలో రూ. 1112.5, కన్యాకుమారిలో రూ.1187, రాంచీలో రూ.1160.5, సిమ్లాలో రూ.1147.5, దిబ్రూగర్‌లో రూ.1145, లక్నోలో రూ.1140.5. ఉదయపూర్‌లో రూ.1132.5, ఇండోర్‌లో రూ.1131, కోల్‌కతాలో రూ.1129, డెహ్రాడూన్‌లో రూ.1122, విశాఖపట్నంలో రూ.1111, చెన్నైలో రూ. 1118.5, ఆగ్రాలో రూ. 1115.5, చండీగఢ్‌లో రూ. 1112.5గా ఉన్నాయి..