వర్షం ఎఫెక్ట్.. సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే, సీఎం చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో పర్యటించాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. దానికి బదులుగా ఓర్వకల్‌లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు… అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం 4గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.. భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. జిల్లాలోని స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించింది.. వర్షాల నేపథ్యంలో పలు పరీక్షలను కూడా వాయిదా వేశారు.. మరోవైపు.. భారీవర్షాల కారణంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది జిల్లా విద్యాశాఖ… ఇక, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. అల్లూరి, అనకాపల్లి జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు.. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సృజన.. ఇక, వాయుగుండం ప్రభావంతో రిషికొండ బీచ్ లో పర్యాటకంపై ఆంక్షలు విధించారు విశాఖ అధికారులు.. సముద్ర విహారానికి వెళ్లే బోట్లను నిలిపివేశారు.
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాలతో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.. మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని ఆదేశించారు.. అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలన్న సీఎం. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని సూచించారు.. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. ఇక, భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైళ్లకు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
హైదరాబాద్‌లో పలుచోట్ల వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వర్షం కారణంగా అక్కడక్కడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ (శనివారం) మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
పూలమాల వేసే విషయంలో గొడవ.. అఖిలేష్ యాదవ్ ఎదుటే తన్నుకున్న కార్యకర్తలు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం కన్నౌజ్ చేరుకున్నారు. ఆయన చిబ్రమావులోని ఓ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. రోడ్డుపై పార్క్ చేసిన కారులో ఆయన కూర్చున్నారు. ఆయన సమీపంలోనే ఇద్దరు కార్యకర్తలు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో, అక్కడ నిలబడి ఉన్న ఇతర కార్యకర్తలు వారిని శాంతింపజేశారు. అఖిలేష్ యాదవ్‌కు పూలమాల వేసే సమయంలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం, గొడవ జరిగినట్లు సమాచారం. గొడవపడుతుండగా వారిద్దరూ అఖిలేష్ కారు ముందుకి చేరుకున్నారు. ఇంతలో భద్రతా సిబ్బంది కూడా శాంతించేందుకు ప్రయత్నించారు. అఖిలేష్‌ను కలిసేందుకే ఈ దాడి ఘటన జరిగిందని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అఖిలేష్, రాహుల్ గాంధీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన ఫుల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ రాహుల్ గాంధీ, అఖిలేష్ బహిరంగ సభ జరిగింది. అయితే తొక్కిసలాట అనంతరం నేతలిద్దరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాగానే కార్యకర్తలు అదుపు తప్పారు. బారికేడ్లను బద్దలుకొట్టి వేదికపైకి చేరుకోవడం ప్రారంభించారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.
సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకం కానుంది అని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో ప్రధాని మోడీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొట్ట మొదటిసారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు వెల్లడించారు. బ్రూనై నుంచి ప్రధాని మోడీ సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌కు వెళ్లనున్నారు.. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోడీ ఈ పర్యటన కొనసాగనుంది. అయితే, ఆగస్టు 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశం- సింగపూర్ రెండవ మంత్రుల సంభాషణ (ISMR) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో డిజిటల్, స్కిల్ డెవలప్‌మెంట్, సస్టైనబిలిటీ, హెల్త్‌కేర్, కనెక్టివిటీతో పాటు అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో రెండు దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది.
పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్క రోజే నాలుగు పతకాలు ఖాతాలో చేరాయి. ఇందులో ఓ స్వర్ణం కూడా ఉంది. టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా.. పారిస్‌లోనూ గోల్డ్ గెలిచింది. షూటింగ్‌లోనే మనీశ్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలిచారు. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించింది. నేడు కూడా భారత్ ఖాతాలో పతకాలు చేరే అవకాశాలు ఉన్నాయి. నేటి భారత్ షెడ్యూల్ ఓసారి చూద్దాం.
పారా షూటింగ్: పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (స్వరూప్)- మధ్యాహ్నం 1, ఫైనల్- మధ్యాహ్నం 3.45
మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (రుబీనా)- మధ్యాహ్నం 3.30, ఫైనల్- సాయంత్రం 6.15
పారా సైక్లింగ్: మహిళల సీ1-3 500మీ టైమ్ ట్రయల్ క్వాలిఫయింగ్ (జ్యోతి)- మధ్యాహ్నం 1.30, ఫైనల్- సాయంత్రం 5.05;
పురుషుల సీ1-3 1000మీ టైమ్ ట్రయల్ క్వాలిఫయింగ్ (షేక్ అర్షద్)- మధ్యాహ్నం 1.49, ఫైనల్- సాయంత్రం 5.32
పారా ఆర్చరీ: మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్ (సరిత × ఎలెనోరా)- రాత్రి 7, (శీతల్ × మారియానా)- రాత్రి 8.59, పతక రౌండ్లు- రాత్రి 11.13
పారా అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (పర్వీన్ కుమార్)- రాత్రి 10.30
సిద్ధార్థ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అదితిరావు హైదరీ!
గత మార్చిలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అదితి చెప్పారు. ‘మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. మాకు హైదరాబాద్‌లో ఓ స్కూల్ ఉంది. నేను చిన్నతనంలో ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. ఆ స్కూల్ అంటే చాలా ఇష్టం. కొన్నాళ్ల క్రితం మా నానమ్మ కన్నుమూశారు. ఓ రోజు సిద్దార్థ్ నన్ను ఆ స్కూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. సిద్దార్థ్ ప్రపోజ్ చేసిన తీరు ఎంతో నచ్చింది. నాన్నమ్మ ఆశీస్సులకోసమే అక్కడ ప్రపోజ్ చేశాడు’ అని అదితిరావు హైదరీ చెప్పారు.
నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?
సెప్టెంబరు 1న బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ టాప్ హీరోలందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్న తరుణం రానే వచ్చింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. ఈ చిత్ర కథ మైథలాఙికల్ టచ్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని మోక్షు పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 6న ప్రకటించబోతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనే క్లారిటీ రాలేదు. బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని మొదట టాక్ వినిపించింది. కానీ తాజాగా SLV బ్యానర్ పై దసరా వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్ర అధికారక ప్రకటన రానుంది. బహుశా అప్పుడు గాని క్లారిటీ రావొచ్చు